ఢిల్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్స్.. మోడీ మానియా..కేజ్రీకి క్రేజ్ తగ్గింది

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయం సాధించడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ తెలిపాయి. ఏబీపీ-నీల్స్‌న్ సర్వే ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాయాజాలంతో భాజపా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ఈ సర్వేలు తెలిపాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ క్రేజ్ తగ్గింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 70 సీట్లకు గాను 46 సీట్లు భాజాపా గెలుచుకుని ఎవ్వరి మద్దతు అవసరం లేకుండా తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

మిగిలిన పార్టీల్లో ఆమ్ఆద్మీ 18, కాంగ్రెస్ 5 స్థానాలతో సరిపెట్టుకుంటాయి. ఇక ఓట్ల పరంగా చూస్తే బీజేపీకి 38 శాతం, ఏఏపీ 26, కాంగ్రెస్ 22 శాతంతో ఉంటాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో మాత్రం ఆప్ అధినేత కేజ్రీవాల్‌కే ఓటర్లు పట్టం కట్టారు. ఆయనకు 39, కేంద్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్థన్‌కు 38, కాంగ్రెస్ తరపున మాజీ సీఎం షీలాదీక్షిత్‌కు కేవలం 7 శాతం, జగదీష్‌ముఖీకి 5 శాతం మంది మద్దతు తెలిపారు. 

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రజాదారణ ఉన్న వ్యక్తుల్లో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఏకంగా 63 శాతం ప్రజల మద్దతు పొందారు. ఈ విషయంలో కేజ్రీవాల్ 25 శాతం, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 12 శాతం ఓట్ల మద్దతుతో చివరి స్థానంలో నిలిచారు.