నవ్విస్తూ..ఆలోచింపజేసే దేవరకొండలో విజయ్ ప్రేమ కథ

నవ్విస్తూ..ఆలోచింపజేసే దేవరకొండలో విజయ్ ప్రేమ కథ

ఆటపాటల వినోదమే కాదు ఆలోచింపజేసే ఓ విషయాన్ని చెప్పినప్పుడే సినిమాకు సార్థకత. అలాంటి పర్ఫస్ ఫుల్ ఫిలిం దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. సందేశం, వినోదం కలిసి పర్ఫెక్ట్ గా కుదరిన అరుదైన చిత్రమిది. విజయ్ శంకర్, మౌర్యానీ జంటగా నటించిన దేవరకొండలో విజయ్ ప్రేమ కథ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ పతాకంపై దర్శకుడు వెంకటరమణ ఎస్ రూపొందించారు. మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ

ప్రేమ కోసం కన్నవారిని, ఉన్న ఊరునీ వీడిన ఓ జంట కథ ఇది. దేవరకొండ గ్రామంలో పెద్దింటి అమ్మాయి దేవకి (మౌర్యాని). అంతా ఆమెను అమ్మాయిగారు అని పిలుస్తుంటారు. తండ్రి సీతారామయ్య (నాగినీడు) అంటే దేవకికి ప్రాణం. కూతురన్నా తండ్రికి అంతే. ఊరులో గౌరవ మర్యాదలు గల పెద్ద మనిషి సీతారామయ్య. కాలేజ్ చదివే దేవకి విజయ్ (విజయ్ శంకర్) అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతనో ఆటో డ్రైవర్. విషయం తెలిసిన సీతారామయ్య తన పరువు తీసిందనే కోపంతో కూతురు ముఖం జన్మలో చూడను అంటూ ఇంట్లో నుంచి పంపిస్తాడు. విజయ్ ను పెళ్లి చేసుకున్న దేవకి, అతనితో పాటు ఊరు చివర జీవిస్తుంటుంది. తండ్రికి తమ విలువ తెలియాలని బాగా చదివి పేరు తెచ్చుకోవాలని దేవకి అనుకుంటుంది. భార్య కోరిక మేరకు ఆమెను చదివించాలని నిర్ణయించుకుంటాడు విజయ్. అందరి ముందు గౌరవంగా బతకాలి అనుకున్న వీరి జీవితాల్లో నీలి నీడలు కమ్ముకుంటాయి. ఆ విపత్కర పరిస్థితులు ఏంటి, వారి జీవితాలను ఎలా మార్చాయి అనేది మిగిలిన కథ.

ఎనాలసిస్

హీరోయిజం ఎలివేట్ చేస్తూ మొదలయ్యే చిత్రమిది. ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్స్, ఫ్రెండ్స్ కామెడీ ఇలా సగటు తెలుగు సినిమా ఫార్మేట్ లో ప్రారంభమవుతుంది. మిగతా చిత్రాల్లాంటిదే ఇది అనుకునే లోపు దర్శకుడు అసలైన కథా కథనాలు ఇవీ అని రివీల్ చేస్తాడు. ఇక్కడ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రంతో హీరో విజయ్ శంకర్ ఓ కమర్షియల్ హీరోకు కావాల్సిన సరుకంతా తనలో ఉందని ఇండస్ట్రీకి సిగ్నల్ పంపాడు. అతను చేసిన ఫర్మార్మెన్స్, డాన్సులు, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. విజయ్ శంకర్ కంటే సీనియర్ అయిన నటి మౌర్యాని..అదే సీనియారిటినీ నటనలోనూ చూపించింది. దేవకి క్యారెక్టర్ లో జీవించింది.

నిజంగా ఊరిలో ఒక పెద్దింటి అమ్మాయి ప్రేమతో కష్టాలు పడితే ఇలాగే ఉంటుందేమో అనిపించింది మౌర్యాని. కూతురు కంటే పరువే ముఖ్యమనుకునే కొందరు తండ్రులను గుర్తుకు తెస్తాడు నాగినీడు. ఆయన సీతారామయ్య క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. నటీనటులే కాదు. టెక్నికల్ గా సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కథను మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి. యూత్, మహిళలు, ప్రేమికులు, తల్లిదండ్రులు అంతా చూడాల్సిన చిత్రంగా దేవరకొండలో విజయ్ ప్రేమకథను చెప్పొచ్చు. మనం చేసే చిన్న నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదకరమో ఒక సినిమా ద్వారా చక్కగా చూపించారు దర్శకుడు వెంకటరమణ.ఎస్. ఆయన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

రేటింగ్ 3/5