దేవీ ఇంకా అదే లోకంలో ఉన్నాడు..

దేవీ శ్రీ ప్ర‌సాద్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కో ఎన‌ర్జిటిక్ ట్రాన్ ఫార్మ‌ర్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు డిఎస్పీ ఆ మూడ్ లో లేడు. ఈ మ‌ధ్యే తండ్రి స‌త్య‌మూర్తి చనిపోవ‌డంతో దేవీ బాగా డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాడు. నాన్న‌తో దేవీకి రిలేషన్ చాలా ఎక్కువ‌. తండ్రీ కొడుకుల్లా కాకుండా.. స్నేహితుల్లా క‌నిపిస్తుండే వాళ్లు ఈ ఇద్ద‌రూ. అలాంటి స‌త్య‌మూర్తి గారు పోవ‌డంతో.. దేవీ పూర్తిగా బాధ‌ల్లోకి వెళ్లిపోయాడు.

తాజాగా ఆయ‌న సంగీతం అందించిన నేను శైల‌జ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది. సాధార‌ణంగా దేవీ ఆడియో వేడుక అంటే ఉండే జోషే వేరు. కానీ నేను శైల‌జ ఆడియో వేడుక‌లో అది క‌నిపించ‌లేదు. రామ్, కీర్తిసురేష్ ఇలా ఎంత‌మంది ఉన్నా.. దేవీ లేని లోటు ఫంక్ష‌న్ లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆయ‌న ఇంకా తండ్రి పోయిన బాధ‌లోనే ఉండ‌టంతో.. నేను శైలజ టీం కూడా హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఆడియో ఫంక్ష‌న్ ముగించేసింది.

ఈ నెల చివ‌ర్లో దేవీ సంగీతం అందించిన నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ఆడియో వేడుక‌కు అయినా దేవీ వ‌స్తాడో లేదంటే అలాగే ఇంటికే ప‌రిమిత‌మవుతాడో తెలియదు. ప్ర‌స్తుతానికైతే తండ్రి లేడ‌న్న వార్త‌ను త‌ట్టుకుని.. మ‌ళ్లీ వ‌ర్క్ లో బిజీ అయిపోయాడు దేవీ. నాన్న‌కు ప్రేమ‌తో ఆర్ ఆర్ ఇస్తున్నాడు దేవీ. ప్రేక్ష‌కులు మ‌ళ్లీ పాత దేవీని చూడాలంటే ఎన్నాళ్లు ప‌డుతుందో అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.