దిక్సూచి మూవీ రివ్యూ

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం “దిక్సూచి”. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్ని మెప్పించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే…. దిలీప్ (దిలీప్ కుమార్ సల్వాది) ప్రెస్ రిపోర్టర్. ఓ రోజు రైల్లో ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ఓ క్రైమ్ స్టోరీ కథ చెబుతాడు. రైలు దిగిన వెంటనే అదే కథ దిలీప్ జీవితంలో జరుగుతుంటుంది. తన అమ్మను, తన చెల్లిని తానే కిడ్నాప్ చేసేలా ఓ వ్యక్తి ఫోన్ ద్వారా ప్రేరేపిస్తాడు. బెదిరిస్తాడు. దీంతో దిలీప్ కిడ్నాపులు చేయాల్సి వస్తుంది. ఇంతకూ ఆ కిడ్నాప్ ఎవరు ఎందుకు చేయిస్తున్నారు. దిలీప్ కూడా ఎందుకు తొలొగ్గి అతను చెప్పిన పని చేశాడు. దిలీప్ కు అతనికి సంబంధం ఏంటి…. ఈ రహస్యాల్ని దిలీప్ ఎలా కనిపెట్టాడు. తన అమ్మను, చెల్లిని ఎలా కాపాడుకున్నాడనేదే అసలు కథ. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష…..

ఇది 1970 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ. సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో తీశారు. సినిమా ఫస్టాఫ్ రేసీగా పరుగెత్తుతుంది. ట్రైన్ లోకి హీరో ఎంటర్ అయిన దగ్గరి నుంచి ఇంటర్వెల్ వరకు కళ్లు తిప్పుకోనీయకుండా సన్నివేశాలుంటాయి. ఫోన్ చేసి బెదిరించే సినిమాలు చాలా చూసుంటాం. కానీ దర్శకుడు దీలీప్ విభిన్నమైన ప్యాటర్న్, స్క్రీన్ ప్లేతో రూపొందించాడు. మూటల్ని అటు ఇటు మార్చే క్రమం బాగుంది. ఆ తర్వాత తనను ఫోన్ లో బెదిరిస్తున్నది… ఎవరు అనేది తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ గ్రాఫిక్స్. పెద్ద సినిమాల మాదిరిగా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. కథకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ టీం బాగా హోం వర్క్ చేశారు. ఎక్కడ అవసరమైతే అక్కడ గ్రాఫిక్స్ ను బాగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా టైటిల్ కార్డ్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు గ్రాఫిక్స్ ఆధారంగా కథను ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే కొత్తగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ లో ఎప్పుడైతే ఓ విలేజ్ లోకి ఎంటర్ అవుతారో సినిమా కలర్ మారిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంట్రస్టింగ్ గా సాగుతాయి. చత్రపతి శేఖర్ అతని కొడుకు.. పాప మధ్య వచ్చే సన్నివేశాలు బాగా రాసుకున్నారు. దర్శకుడు ఎక్కడ వీలయితే అక్కడ జీవిత సత్యాల్ని, ఫిలాసఫీని టచ్ చేస్తూ వెళ్లాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో క్యూరియాసిటీ రెట్టింపు చేశాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కావడంతో ప్రేక్షకులు డైవర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. క్లైమాక్స్ ని కూడా రెగ్యులర్ గా కాకుండా విభిన్నంగా…. ఎవ్వరూహించని విధంగా ప్లాన్ చేశారు.

హీరో దిలీప్ చాలా కష్టపడ్డాడు. తానే దర్శకుడు, రచయిత కావడంతో చాలా క్లారిటీగా ఉన్నాడు. అటు హీరోగా… ఇటు దర్శకుడిగా రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేయగలిగాడు. నటించేందుకు స్కోప్ ఉన్న ప్రతీ సీన్ లోనూ ఆకట్టుకున్నాడు. కథను తన భుజాలమీదేసుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో పలు ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా అతని కెరీర్ ను టర్న్ చేస్తుందని చెప్పొచ్చు. హీరోయిన్ చాందిని తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరోను సపోర్ట్ చేసే పాత్రలో మెప్పించింది. ఛత్రపతి శేఖర్ కు చాలా మంచి రోల్ పడింది. ఉద్వేగానికి లోనైన సందర్భంలో, తన ఎక్స్ ప్రేషన్స్ తో సీన్స్ ని బాగా పండించాడు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ తో పాటు… మిగిలిన పాత్ర ధారులు సైతం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్లాడు. అందుకే ప్రతీ పాత్ర గుర్తిండిపోయేలా ఉంటుంది.

ఈ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. పద్మనాభ భరద్వాజ్ పాటల పరంగా, రీరికార్డింగ్ పరంగా కథను బాగా ఎలివేట్ చేశాడు. ఆర్ ఆర్ తో సన్నివేశాల్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. చాలా సందర్భాల్లో దర్శకుడు సన్నివేశాల కంటే కూడా పాటలతో కథను చెప్పాడు. ఆ పాటలన్నీ సందర్భానుసారంగా వచ్చేవే. వాటిని పూర్తి న్యాయం చేశాడు. జయకృష్ణ, రవికొమ్మి కెమెరావర్క్ ప్రామిసింగ్ గా ఉంది. తమ కెమెరాతో చాలా సీన్స్ ని హైలైట్ చేశారు. లైటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది. దర్శకుడు రెగ్యులర్ ప్యాటర్స్ సినిమా కాకుండా విభిన్నమైన కథ, కథనాల్ని ఎంచుకొని సక్సెస్ సాధించాడు. ఈ తరహా కథ, కథనం మనకు చాలా కొత్త. అయినప్పటికీ… తనదైన శైలిలో తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. అటు హీరోగా, ఇటు దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించాడు. డైలాగ్స్ సైతం చాలా బాగా రాసుకున్నాడు. నిర్మాతలు సైతం దర్శకుడి విజన్ కు తగ్గట్టుగా బాగా ఖర్చు పెట్టారు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా… విభిన్నమైన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసమే దిక్సూచి. ఇదో కొత్త రకం జోనర్ లా అనిపిస్తుంది. అన్ని వర్గాలప్రేక్షకులు మెచ్చే కంటెంట్ కాబట్టి… హ్యాపీగా చూసేయ్యెచ్చు. గో అండ్ ఎంజాయ్.

PB Rating : 3/5