మాలాంటి వాళ్లని బ‌త‌క‌నివ్వాల‌ని కోరుతున్నాను – దిలీప్ కుమార్ సల్వాది

దిలీప్‌కుమార్‌ సల్వాది హీరోగా నటించి డైరెక్ట్ చేసిన చిత్రం `దిక్సూచి`. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చాందిని భ‌గ‌వ‌నాని నాయికగా నటించగా ఛత్రపతి శేఖర్ ముఖ్య పాత్ర పోషించారు. శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి ఈ చిత్రానికి నిర్మాత‌లు. ప‌ద్మనాభ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించ‌గా.. జయకృష్ణ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 65 థియేట‌ర్ల‌లో రిలీజైంది ఈ చిత్రం. క్రిటిక్స్ నుంచి యునానిమ‌స్ గా ప్ర‌శంస‌లు పొందిన ఈ సినిమాకి నైజాంలో ఆశించిన థియేట‌ర్లు ద‌క్క‌లేద‌ని .. అయితే సినిమా రిలీజైన అన్నిచోట్లా ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంద‌ని చిత్ర‌ ద‌ర్శ‌కుడు దిలీప్ కుమార్ చెబుతున్నారు.

ద‌ర్శ‌కుడు.. హీరో దిలీప్ కుమార్ మాట్లాడుతూ-“అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాతో పోటీప‌డుతూ మా సినిమాని రిలీజ్ చేసిన మాట వాస్త‌వ‌మే అయినా.. సినిమా బావుంది అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాక అయినా ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోవ‌డం బాధ క‌లిగిస్తోంది. ఏపీ- నైజాంలో 65 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశాం. ఇందులో మెజారిటీ పార్ట్ ఏపీలోనే. నైజాంలో కేవ‌లం మూడు థియేట‌ర్లు మాత్ర‌మే ఇచ్చారు. అయితే హైద‌రాబాద్ లాంటి చోట్ల మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో మా సినిమాకి అవ‌కాశం క‌ల్పిస్తే గొప్ప మైలేజ్ ఉంటుందన్న న‌మ్మ‌కం జ‌నాల స్ప ంద‌న చూశాక క‌లిగింది. థియేట‌ర్లు ఇవ్వ‌లేదు అని ఎవ‌రినీ నిందించ‌ను. సినిమా బావుందో లేదో చూసి థియేట‌ర్లు ఇస్తార‌ని ఆశిస్తున్నాను. పాజిటివ్ టాక్ వ‌చ్చింది. మంచి థియేట‌ర్ల‌లో సినిమా ప‌డితే బాగా ఆడుతుంద‌ని అభ్య‌ర్థిస్తున్నాను. ఈ విష‌యంలో నాకు సాయం చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. క‌నీసం సినిమా చూపిస్తాను అంటే చూసేందుకే రావ‌డం లేదు.. ఏడాది పాటు శ్ర‌మించి .. బాల‌న‌టుడిగా హీరోగా అనుభవం ఉన్న నేను.. ద‌ర్శ‌క‌హీరోగా ప్ర‌య‌త్నించిన సినిమాని జ‌నాల‌కు చేరువ చేయ‌లేక‌పోతున్నాన‌నే ఆవేద‌న ఉంది. తెలుగు గ‌డ్డ‌పై తెలుగువాడికి అవ‌కాశం ఇవ్వ‌రా? అని క‌ల‌త చెందుతున్నాను“ అని అన్నారు.

ర‌చ్చ గెలిచాం.. ఇంట ఓడాం!!
మా సినిమాకి అమెరికా లాంటి చోట అవెంజ‌ర్స్ రిలీజైన ఈ టైమ్ లో 40 షోలు ఇప్ప‌టికే ఆడించ‌గ‌లిగాం. కానీ నైజాంలో థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డం ఆవేద‌న‌కు గురి చేస్తోంది. నైజాం ప‌రిశీలిస్తే.. హైద‌రాబాద్ లో రెండు థియేట‌ర్లు.. నాగ‌ర్ క‌ర్నూల్ ఓ థియేట‌ర్ ద‌క్కాయి. ఇక్క‌డ ఇంకా ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజైతే జ‌నాల‌కు చేరువ‌వుతుంద‌ని.. బాగా ఆడుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. నేను ఎవ‌రినీ నిందించ‌ను. అయితే సినిమాలో స‌త్తా ఉంద‌ని ఇప్ప‌టివ‌ర‌కూ వీక్షించిన క్రిటిక్స్ .. ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అందుకే క‌నీసం థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌లో చిన్న సినిమాకి మంచి సినిమాకి క‌నీస రిజ‌ర్వేష‌న్ కావాల‌ని … మాలాంటి వాళ్లని బ‌త‌క‌నివ్వాల‌ని కోరుతున్నాను. బాలేదు అన్న కార‌ణంతో కాకుండా బావుండీ నా నిర్మాత‌ల క‌ళ్ల‌లో ఆనందం చూడ‌లేక‌పోతున్నాను అని దిలీప్ ఆవేద‌న చెందారు.