దర్శకుడు భాస్కరరావు కన్నుమూత…సినీ జీవితమిదే…

ప్రముఖ సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు (78) శనివారం రాత్రి సికింద్రాబాద్ లో కన్నుమూశారు. ఆయనకు భార్య కళ్యాణితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆగస్టు 29, 1936లో గాస్ మండి(రాణిగంజ్)లో జన్మించిన భాస్కరరావు మహబూబ్ కాలేజిలో ఎనిమిదివ తరగతి పూర్తి చేశారు. 1959లో సినీ రంగప్రవేశం చేసిన ఆయన వి.మధుసూదన్ రావు, తాపీ చాణక్య, ఆదుర్తి సుబ్బారావు, భీమ్ సింగ్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 40కి పైగా చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కృష్ణ, జమున నాయికానాయకులుగా రూపొందిన మనుషులు మట్టిబొమ్మలు చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన భాస్కరరావు తొలి చిత్రంతోనే ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ లాంటి అగ్రనటీనటులతో 18 సినిమాల్ని రూపొందించారు.

గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, శ్రీవారు, గృహలక్ష్మి, కుంకుమతిలకం, చల్ మోహన్ రంగ, రాధా మై డార్లింగ్, చదరంగం, కళ్యాణ తిలకం, సర్దార్ ధర్మన్న, అగ్గిరాజు, గృహలక్ష్మీ, ఆస్తులు అంతస్తులు, శ్రీరామచంద్రలు, సక్కనోడు, ఉమ్మడి మొగుడు, మామ కోడలు చిత్రాలు దర్శకుడిగా భాస్కరరావుకు మంచి పేరును తీసుకొ్చ్చాయి. కెరీర్లో అత్యధికంగా కృష్ణంరాజుతో 5, జయసుధతో 7 చిత్రాల్ని తెరకెక్కించారాయన. సోమవారం ఉదయం అంబర్ పేట్ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియల్నినిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్, సయ్యద్ రఫీ తదితరులు భాస్కరరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.