తమ్ముడిని నిలబెట్టాలని ఎన్నో ఒత్తిళ్లని ఎదుర్కొని ఈ మాయ పేరేమిటో నిర్మించింది – రాహుల్ విజయ్

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌. వి.ఎస్‌.ఎ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. ఈ నెల 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో రాహుల్ విజయ్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు….

ఎలాంటి కథల్ని ఎంచుకుంటున్నారు….
చూసే ప్రేక్షకులు… ఇతను అచ్చం మన అబ్బాయిలానే ఉన్నాడనుకోవాలి. నేను ఎంచుకొనే కథలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. ఈ అంశాల్ని మనసులో పెట్టుకొనే తొలి చిత్రం చేశా.

ఈ మాయ పేరేమిటో చిత్రం ఎలాంటి కథ…
శ్రీరామ చంద్ర మూర్తి అనే ఓ యువకుడి కథ ఇది. చందు అనే పేరుతో చలామణీ అవుతుంటాడు. డిగ్రీ పూర్తై సరదాగా తిరిగే చందు జీవితం ఓ అమ్మాయి వల్ల మారుతుంది. ఆ మార్పు ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపింది? వ్యక్తిగతంగా తనకి ఏం జరిగిందనే విషయాలతో సాగే చిత్రమిది.

డైరెక్టర్ గురించి చెప్పండి…
యువతరం జీవితాల్ని ప్రతిబింబించే ఒక అందమైన ప్రేమకథ ఇది. సుకుమార్‌ దగ్గర పనిచేసిన రాము కొప్పుల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథల్లో నటించడానికి సరైన వయసు నాది. అందుకే ఒక మంచి ప్రేమకథతో మొదలుపెట్టి, రకరకాల కథల్లో నటిస్తూ వెళ్లాలనేది నా ఆలోచన. అందుకు తగ్గట్టే నా ప్రయాణం మొదలైంది.

సినిమాలపై ఆసక్తి మీదేనా…లేక మీ తండ్రి ఒత్తిడి ఏమైనా ఉందా…
సినిమా పరిశ్రమలోనే పుట్టి పెరిగినవాణ్ని. చిన్నప్పట్నుంచీ నాన్నతో కలిసి సెట్‌కి వెళ్లేవాణ్ని. ఎనిమిదో తరగతికి వచ్చాక నాన్న ‘సినిమాలపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు. నేను ఆసక్తి ఉందని చెప్పగానే లారెన్స్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆ తర్వాత ఒక పక్క చదువు కొనసాగిస్తూనే, మరో పక్క ఎనిమిదేళ్లు సినిమాలకి సంబంధించి పలు విభాగాల్లో శిక్షణ తీసుకొన్నా. జిమ్నాస్టిక్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌, హార్స్‌రైడింగ్‌, బ్యాంకాక్‌ వెళ్లి ఫైట్లు నేర్చుకొన్నా. దేవదాస్‌ కనకాల, లక్ష్మీదేవి కనకాల, సత్యానంద్‌ల దగ్గర న‌టనలో శిక్షణ తీసుకొన్నా. ‘ఒక కథ మన దగ్గరికి వచ్చినప్పుడు, అందులోని పాత్రకి ఏది అవసరమైనా చేయడానికి సిద్ధంగా ఉండాల’ని నాన్న చెప్పేవారు. అందుకే అన్ని రకాలుగా శిక్షణ పొందా.

ఈ సినిమాలో ఎలాంటి విజయం ఆశిస్తున్నారు…
నన్ను నేను మానిటర్‌పైన ఎప్పుడు చూసుకొంటానో అనిపించేది. ఆ కల ఈ చిత్రంతో తీరింది. మా నాన్న అయితే ‘ఈ సినిమా ఎంతవరకు ఆడుతుందో చెప్పలేను. నువ్వు మాత్రం హీరోగా సక్సెస్‌ అయ్యావ్‌ రా’ అన్నారు. ఒక సాంకేతిక నిపుణుడిగా ఆయన చెప్పిన ఆ మాట చాలా తృప్తినిచ్చింది. నేను సినిమాలకి పనికొస్తాననే నమ్మకం వచ్చింది.

మీ సోదరి నిర్మాత కదా…
మా సోదరి దివ్యా విజయ్‌ తన తమ్ముడిని నిలబెట్టాలని ఎన్నో ఒత్తిళ్లని ఎదుర్కొని ఈ సినిమా నిర్మించింది. కానీ ఒక మంచి సినిమా చేశాననే తృప్తి ఆమె ముఖంలో కనిపించడం చాలా సంతోషాన్నిచ్చింది.

మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమా చేస్తున్నారు.. ఆసినిమా ఎంతవరకు వచ్చింది.
నిహారికతో కలిసి చేస్తున్న కొత్త చిత్రం ఒక రొమాంటిక్‌ కామెడీ కథతో తెరకెక్కుతోంది. పది రోజులు చిత్రీకరణ చేస్తే ఆ సినిమా పూర్తవుతుంది. మరో వారంలో కొత్త సినిమా ప్రకటిస్తాం.