కంచె క‌డుతున్న అభిమానులు..

ఇంత‌వ‌ర‌కు అభిమానులు అంటే ఓ ఫ్యామిలీకి మొత్తం క‌లిపి ఉండేవాళ్ళు. ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్ అంటే మొత్తం కుటుంబానికి అని అర్థం. అంతేకానీ బాల‌య్య అభిమానులు అని.. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు అని ఉండేవాళ్ళు కాదు. అలాగే మెగాఫ్యాన్స్ అంటే ప‌వ‌న్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ అని కాదు అర్థం. అంతా ఒక‌టే అని. ఇది ఒక‌ప్పటి మాట‌. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అభిమానుల మ‌ధ్య చీలిక‌లు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కుటుంబంలో ఇద్ద‌రు హీరోలుంటే.. అభిమానులు కూడా వాళ్ళ‌లో ఒక్కొక్క‌రికీ అని షిఫ్ట్ అయిపోతున్నారు.

నంద‌మూరి బాబాయ్ అబ్బాయ్ నే తీసుకోండి. నిన్న జ‌రిగిన నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో ఫంక్ష‌న్ చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. ఈ వేడుక‌లో ఎక్క‌డా జై బాల‌య్య అని గానీ.. బాల‌కృష్ణ ఊసు గానీ ఎక్క‌డా వినిపించ‌లేదు. అలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు జూనియ‌ర్. గ‌తంలో జ‌రిగిన చాలా ఆడియో వేడుక‌ల్లో బాబాయ్ ను తలుచుకునే ఎన్టీఆర్.. నాన్న‌కు ప్రేమ‌తో ఫంక్ష‌న్ లో మాత్రం తాత‌, తండ్రిని మాత్ర‌మే త‌లుచుకున్నాడు. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ కూడా తన తండ్రే గొప్ప అంటూ నంద‌మూరి ఫ్యామిలీలో హ‌రికృష్ణ‌ను హైలైట్ చేసాడు. ఇక హ‌రికృష్ణ కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను నంద‌మూరి తార‌క‌రామారావు అంశ అని చెప్పి.. ఆ వంశానికి అస‌లైన వార‌సుడు ఎన్టీఆరే అని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇదంతా నంద‌మూరి అభిమానుల స‌మ‌క్షంలోనే జ‌రిగింది. అయితే అక్క‌డున్న‌ది కేవ‌లం ఎన్టీఆర్ అభిమానులు మాత్ర‌మే.

ఈ మ‌ధ్య ఏ వేడుక జ‌రిగినా.. జై బాల‌య్య అని అర‌వ‌డం కామ‌న్ అయిపోయింది. అందుకే నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో వేడుక‌కు కేవ‌లం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్ర‌మే పాస్ లు వెళ్ళాయ‌ని స‌మాచారం. బాల‌కృష్ణ ఫంక్ష‌న్ కు జూనియ‌ర్ అభిమానుల‌కు కూడా పాస్ లు ఇస్తున్నారు. కానీ యంగ్ టైగ‌ర్ ఫంక్ష‌న్స్ కు మాత్రం బాల‌య్య అభిమానుల్ని దూరం పెడుతున్నారు. కార‌ణం జై బాల‌య్య నినాదం. అచ్చు.. ఇదే మెగా ఫ్యామిలీలోనూ జ‌రుగుతుంది. మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ గా ఇప్పుడు విడిపోయారు అభిమానులు.

మెగా హీరోల‌కు సంబంధించిన ఏ వేడుక జ‌రిగిన ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌డం కామ‌న్ అయిపోయింది. ఒకానొక టైమ్ లో ఇది మెగా హీరోల‌కు చిరాకు తెప్పించింది కూడా. నాగబాబు అయితే మొన్న అన్న బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఫ్యాన్స్ పై అరిచాడు. ప‌వ‌ర్ స్టార్ నినాదాల‌తో విసిగిపోయిన మెగాక్యాంప్.. తమ ఫంక్ష‌న్ ల‌కు కేవ‌లం చిరంజీవి ఫ్యాన్స్ కు మాత్ర‌మే పాస్ ఇవ్వాల‌ని సూచించారు. ఇదే టైమ్ లో ప‌వ‌న్ ఫంక్ష‌న్ కు మాత్రం అంద‌రికీ పాస్ లు వెళ్తున్నాయి. దీనికి కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌వ‌ర్ స్టార్ ఉంటే అభిమానులు మ‌రేదో అడ‌గ‌ట్లేదు అక్క‌డ. మొత్తానికి ఇన్నాళ్లూ కుటుంబానికి ఉన్న అభిమానులు కాస్తా ఇప్పుడు హీరోల‌కు అభిమానులుగా మారిపోతున్నారు. ఈ సంస్కృతి టాలీవుడ్ ను ఎటువైపు తీసుకెళ్తుందో మ‌రి.