గబ్బర్‌సింగ్-2 తర్వాత పవన్ సినిమా ప్రాజెక్టు డీటైల్స్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన గబ్బర్‌సింగ్-2 ప్రాజెక్టు తర్వాత చేయబోయే సినిమా గురించి చర్చలు జరుగుతున్నట్టు ఫిల్మ్‌నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోపాలా..గోపాలా సినిమాలో నటిస్తున్న పవన్ ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే పవన్ కేఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో గబ్బర్‌సింగ్-2 సినిమాలో నటిస్తాడు. ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా మేలో విడుదలవుతోంది. గబ్బర్‌సింగ్-2 షూటింగ్ పూర్తయ్యాక పవన్ శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌పై జె.పుల్లారావు, భగవాన్ నిర్మించే చిత్రంలో నటించనున్నారు. వీరు గతంలో బాలకృష్ణతో సీమసింహం, ప్రభాస్‌తో రెబల్ తదితర భారీ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.