గ్యాంగ్ లీడ‌ర్ ను నిండా ముంచేసిన సాహో..

నాని హీరోగా న‌టిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. విక్ర‌మ్ కే కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. జులై 24న టీజ‌ర్ కూడా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ప్రియాంక అనే కొత్త‌మ్మాయి హీరోయిన్ గా న‌టిస్తుంది. అంతా బాగానే ఉంది.. సినిమా కూడా ఆగ‌స్ట్ 30న విడుదల కానుంద‌ని ముందు నుంచి చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ సాహో సినిమా ఇప్పుడు ఆగ‌స్ట్ 30న విడుదల కానుంద‌ని తేల‌డంతో ఇప్పుడు నాని ఆలోచ‌న‌లో ప‌డుతున్నాడు. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాను వాయిదా వేయాల‌ని చూస్తున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్.
అలా కాద‌ని సాహో సినిమాతో అయితే పోటీ ప‌డ‌లేరు. అలా ప‌డినా కూడా ప్ర‌భాస్ దెబ్బ‌కు నాని సినిమా నామ‌రూపాలు లేకుండా పోతుంది. ఒక‌వేళ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా సాహో సినిమా ధాటికి త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందుకే ప్ర‌భాస్ కు రెండు వారాల గ్యాప్ ఇచ్చి రాబోతున్నాడు నాని. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తుంది. గ్యాంగ్ లీడ‌ర్ ను సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఒక‌వేళ ఇదే కానీ నిజ‌మైతే వ‌రుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో నానికి పోటీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌బోతుందో..?