ప‌క్కా ప్లానింగ్ తో వ‌స్తున్న గోపీచంద్..

పోటీ ఎవ‌రికైనా పోటీనే. బాలీవుడ్ లో చూసాం క‌దా.. ఒకేరోజు వ‌చ్చి దిల్ వాలే, బాజీరావ్ ఎంత‌గా న‌ష్ట‌పోయాయో..! ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇలాంటి వారే జ‌ర‌గ‌బోతుంది. డిసెంబ‌ర్ 25న కుప్ప‌లు తెప్ప‌లుగా సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. అందుకే త‌న సినిమాను తెలివిగా ఓ రోజు ముందే దించేస్తున్నాడు గోపీచంద్. లౌక్యం త‌ర్వాత ఈ హీరోలో లౌక్యం బాగా పెరిగిపోయింది. అందుకే విజ‌యం అనే ఒకే ల‌క్ష్యంతో ముందడుగేస్తున్నాడు గోపీచంద్. డిసెంబ‌ర్ 24న సౌఖ్యం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. త‌ర్వాత రోజు వ‌చ్చే మామ‌మంచు అల్లుడు కంచు, జ‌త‌క‌లిసే, భ‌లే మంచి రోజు లాంటి సినిమాల‌కు బ్యాండ్ బాజా బారాత్ త‌ప్ప‌దు.

ఒక‌ప్పుడు గోపీ సినిమాలంటే క‌త్తులు, బాంబులు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు గోపీచంద్ సినిమా అంటే అమ్మాయిలు, కామెడీ గుర్తొస్తున్నాయి. లౌక్యంతో త‌న‌లోని కామెడీ యాంగిల్ ను బ‌య‌ట పెట్టాడు గోపీచంద్. ఆ సినిమా త‌ర్వాతి జిల్ తో రొమాంటిక్ కోణాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సౌఖ్యంతో రెండు క‌లిపి కొట్టేస్తున్నాడు గోపీచంద్. ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి సౌఖ్యం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. 30 ఇయ‌ర్స్ పృథ్వీ బాహుబ‌లి స్పూఫ్ ట్రైల‌ర్ కే హైలైట్. ఈ చిత్రంలో గోపీ స‌ర‌స‌న రెజీనా న‌టిస్తుంది. 

డిసెంబ‌ర్ 24న సౌఖ్యం థియేట‌ర్స్ లోకి రానుంది. లౌక్యంకు సూప‌ర్ స్క్రీన్ ప్లే అందించిన కోన‌వెంక‌ట్, గోపీమోహ‌న్ ఈ చిత్రానికి కూడా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫ‌ర్. శ్రీ‌ధ‌ర్ సీపాన క‌థ అందించాడు. య‌జ్ఞంతో ర‌వికుమార్ చౌద‌రిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసింది గోపీచందే. ఈ సినిమాతోనే హీరోగా రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాడు ఈ యాక్ష‌న్ హీరో. యజ్ఞం మాదిరిగానే ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు ర‌వికుమార్ చౌద‌రి. గ‌తేడాది పిల్లా నువ్వులేని జీవితంతో సక్సెస్ అందుకున్న ర‌వి.. అదే ఊపు కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు. శౌర్యం, లౌక్యం సినిమాలు తీసిన ఆనంద్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి గోపీచంద్ వేసిన ప్లాన్ సౌఖ్యంకు ఏ మేర‌కు క‌లిసొస్తుందో చూడాలి.