ఓటేసిన గవర్నర్, రామోజీరావ్, పవన్, ఎన్టీయార్

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ఈ ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వేసవి తాపం అధికం అవుతుండడంతో ప్రముఖులు ఈ ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు విచ్చేసారు. రాజ్ భవన్ ఎదుట ఉన్న రాజ్ నగర్ లోని 111 వ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ ఓటు హక్కు వినియోగించింది. అయితే గవర్నర్ ఓటే వేసే సమయంలో ఈవీఎం మొరాయించింది.

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు హయత్ నగర్ మండలం అనాజ్ పూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దసేపటికే ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ జూబ్లిహిల్స్ లోని గాయత్రీ హిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ప్రతీ ఒక్కరు ఓటేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపిచ్చారు. రోడ్ నెం.45 ఉమెన్స్ కోపరేటివ్ సొసైటీలో నాగార్జున, అమల ఓటేశారు. జూనియర్ ఎన్టీయార్, ఆయన సతీమణి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఓటేశారు.