సమీక్ష – గోవిందుడు అందరివాడేలే సమీక్ష

రివ్యూ: గోవిందుడు అందరివాడేలే

నటీనటులు: రాంచరణ్‌తేజ్, కాజల్, శ్రీకాంత్, కమలినీముఖర్జి, ప్రకాష్‌రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, రావూ రమేష్, పోసాని కృష్ణమురళి, ఆదర్శ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

సంగీతం: యువన్‌శంకర్ రాజా

నిర్మాత: బండ్ల గణేష్

రచన: పరుచూరి బ్రదర్స్

కథ, స్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ

విడుదల తేదీ: 01 అక్టోబర్, 2014

 

రేటింగ్: 3.5

 

మెగాస్టార్ తనయుడిగా తెరంగ్రేటం చేసిన రాంచరణ్ తేజ్ తొలిసారిగా తన శైలీకి భిన్నంగా ఓ కుటుంబ కథా చిత్రంలో నటించాడు. ఇప్పటి వరకు మగధీర, రచ్చ, నాయక్, ఎవడు ఇలా వరుసపెట్టి యాక్షన్ సినిమాలే చేస్తూ వచ్చాడు. ఈ సారి తన ట్రాక్ మార్చి ఓ కుటుంబ కథా చిత్రంతో మన ముందుకు వచ్చిన చిత్రం గోవిందుడు అందరివాడేలే. తనకు వరుస హిట్లు ఇస్తూ అచ్చొచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో ముచ్చటగా మూడోసారి జోడీ కట్టాడు. అలాగే చాలా రోజుల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడన్న వార్తలు కూడా ముందే వచ్చాయి. నిర్మాత బండ్ల గణేష్ కూడా ఎక్కడా రాజీపడకుండా భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ గోవిందుడు అందరివాడయ్యాడా లేదా చూద్దాం.

 

కథ, కథనం:

అనగనగా ఓ పల్లెటూళ్లో ఉండే ప్రకాష్‌రాజ్-జయసుధ దంపతులది ఉమ్మడి కుటుంబం. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు తండ్రి డాక్టర్ అయి తర్వాత ఇంటికి వస్తాడు. అయితే తండ్రి సొంత ఊర్ళో హాస్పటల్ కట్టించి పేదలకు వైద్యం చేయమంటాడు. అతడు తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకుని లండన్‌లో సెటిలవుతాడు. అతడి కొడుకే అభిరామ్(రాంచరణ్). ఎప్పటికైనా ఫ్యామిలీని కలుసుకోవాలనుకున్న తండ్రి కోరిక మేరకు ఆ పల్లెటూరు చేరుకున్న అభి అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్‌రాజు)కు దగ్గరవుతాడు. అతడు లండన్‌లో పెరిగినా మనదేశ ఆచార, సంప్రదాయాలు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. అలా ఆ కుటుంబంలో అందరికి తలలో నాలుకలా మారతాడు. అతడు తమ మనవడే అన్న విషయం ఆ కుటుంబంలో ప్రకాష్‌రాజ్‌కి తప్ప అందరికి తెలిసిపోతుంది. ఈ లోగా అభి కాజల్‌తో ప్రేమలో పడతాడు. అయితే తాత ప్రకాష్‌రాజ్ కాజల్‌కు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయిస్తాడు. చివరకు అభి తన మనవడే అని తెలుసుకున్న బాలరాజు ఏం చేశాడు. అభి తన తండ్రిని తాత వద్దకు చేర్చాడా.. కాజల్‌తో అభి పెళ్లి జరిగిందా.. వీళ్ల ఉమ్మడి కుటుంబం కథ ఏమైంది అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. 

 

నటీనటుల ప్రదర్శన:

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారు. హీరో రాంచరణ్ విషయానికి వస్తే తొలిసారిగా ఈ తరహా క్యారెక్టర్‌లో నటించినా చాలా బాగా చేశాడు. అటు ప్రేమ సన్నివేశాలతో పాటు ప్రకాష్‌రాజ్‌తో కర్రసాము చేయడంలో అలాగే సెంటిమెంట్ సీన్లలో కూడా అతడి నటన చాలా బాగుంది. ఈ సినిమాలో ఛెర్రీ నటన అతడి సినీజీవితంలో కలికితురాయిగా నిలిచింది. అతడి కేరీర్‌ను మరో మెట్టు ఎక్కించేలా చేశాడు కృష్ణవంశీ అనక తప్పదు. మరదలు కాజల్ నడుముకు, బొడ్డుకు, మొఖానికి బురద రాసే చిలిపి సీన్లతో పాటు కాజల్‌తో మాట్లాడుతూ మెడపై ముద్దులు పెట్టేసే సీన్ ఇలా ఒకటేమిటి వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అసలు బావా మరదళ్లు మధ్య సరసం ఎలా ఉండాలో కృష్ణవంశీ చక్కగా ప్రజెంట్ చేశాడు. ఇక ఈ సినిమాలో చెప్పు కోవాల్సిన మరో జంట ప్రకాష్‌రాజ్-జయసుధలది. వారు సినిమాలో నటించారు అనేకంటే ప్రాణం పోశారని చెప్పుకోవాలి. ఓ కుటుంబ పెద్దగా ఎలా ఉండాలో ప్రకాష్‌రాజ్, అంత పెద్ద కుటుంబంలో ఇబ్బందులు వస్తే ఎలా తట్టుకోవాలో తెలిసిన భార్యగా జయసుధ చక్కగా నటించారు. పరిణితి చెందిన వారి నటనకు వంకలు వెదకలేం.

 

ఇక బంగారిగా శ్రీకాంత్ తన తండ్రి ఇంట్లో నుంచి గెంటేస్తే బయట ఉండే పాత్రలో బాగా నటించాడు. అతడు మరదలు కమిలినిముఖర్జితో చేసే చిలిపి చేష్టలు.. రేప్ చేస్తే మనిద్దరికి పెళ్లి చేస్తారంటూ ఆమెతో సరసం ఆడడం ఇవన్నీ చాలా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. కమలిని అచ్ఛమైన పల్లెటూరి మరదలు పిల్లగా బాగా నటించింది. అలాగే ఛెర్రీ అత్తలు, మామలకు కూడా సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాయి. మరోలా చెప్పుకోవాలంటే సినిమాలో ప్రతి సీన్‌లోను అందరూ స్క్రీన్‌పై కనిపిస్తూ సినిమాకే నిండుదనం తెచ్చారు. ఇక విలన్ గ్యాంగ్‌గా ప్రకాష్‌రాజ్‌కు తోడల్లుడు పాత్రలో కోట శ్రీనివాసరావు, అతడి కుమారుడు రావూ రమేష్, కోట మనవడిగా ఆదర్శ్ కూడా అప్పుడప్పుడు మెరిసి విలనిజం ప్రదర్శించారు.

 

సాంకేతిక నిపుణుల ప్రదర్శన:

సంగీతం:

యువన్‌శంకర్ రాజా అందించిన సంగీతంలో పాటలు బాగున్నాయి. ఇటీవల పాటల్లో సాహిత్యానికి తగిన సంగీతం కరువవుతున్న టైంలో యువన్ పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా ఇచ్చాడు. సినిమాకు తగ్గట్టుగా ఎక్కువ సీన్లలో డ్రమ్స్‌ను పక్కన పెట్టి కీబోర్డుతో ఇచ్చిన సంగీతం చక్కగా వినసొంపుగా ఉంది. ఇటీవల వస్తున్న తెలుగు సినిమా పాటలు, నేపథ్యసంగీతం కంటే చాలా చక్కగా ఇచ్చాడు. కొన్ని సెంటిమెంట్ సీన్లలో తండ్రి ఇళయరాజాను గుర్తుకుతెచ్చాడు. ముఖ్యంగా నీలిరంగు చీరలోను, బావ నవ్వు ముద్దబంతి పువ్వు పాటలు సూపర్బ్‌గా ఉన్నాయి. తెరమీద వాటిని మళ్లీ వింటూ చూడాలనిపిస్తోంది.

 

సినిమాటోగ్రఫీ/ఎడిటింగ్:

సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. అందమైన రంగుల హరివిల్లు లాంటి ఈ సినిమాలో గొబ్బెమ్మ నుంచి ముగ్గుల్లో రంగుల వరకు ప్రతి చిన్న అందాన్ని కూడా చక్కగా తన ఫ్రేమ్‌లో బంధించాడు. పల్లెటూరి అందాలను బాగా కవర్ చేశాడు. తన సినిమాటోగ్రఫీతో సినిమాకు నిండుదనం తెచ్చాడు. పాటలతో పాటు ప్రతి సెట్టింగ్‌ను బాగా చూపించాడు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదనిపించినా సినిమాలో కొన్ని సాగదీత సన్నివేశాల నిడివి తగ్గించాల్సి ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో చాలా చోట్ల సినిమా స్లో అవుతూ ఉంటుంది. 160 నిమిషాల సినిమాను కనీసం 15 నిమిషాల వరకు ఎడిట్ చేయాల్సి ఉంది. ఆ సీన్లన్ని కూడా ఎక్కువగా సెకండాప్‌లోనే ఉన్నాయి.

 

యాక్షన్/డ్యాన్స్/రచన

ఈ సినిమా కుటుంబ కథాచిత్రం కావడంతో యాక్షన్ స్కోప్ తక్కువ ఉన్నా ప్రకాష్‌రాజ్‌తో ఛెర్రీ కర్రసాము సన్నివేశాలు, విలన్‌గ్యాంగ్‌తో చేసే ఒకటి రెండు ఫైట్లలో కొన్ని సీన్లు కొత్తగా ఉన్నాయి. ఇక సినిమాలో ఛెర్రీ సింపుల్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎంట్రీ పాటలో డ్యాన్స్ బాగుంది. నీలిరంగుతో పాటు బావ పాటలో అందరూ వేసిన డ్యాన్స్ చూడచక్కగా ఉంది. పరుచూరి బ్రదర్స్ మాటలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి. కాజల్-ఛెర్రీ లవ్ సీన్స్‌తో పాటు సెంటిమెంట్ సీన్లలో డైలాగులు బాగా పండాయి.

 

నిర్మాణ విలువలు:

అగ్ర నిర్మాత బండ్ల గణేష్ సినిమాకు ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టాడు. అంతకంటే ముందుగా ఇలాంటి సినిమాను ఇంత భారీ తారాగణంతో ఇంత ఖర్చుతో నిర్మించినందుకు ఆయన్ను అభినందించాలి. సినిమా వేసిన సెట్టింగులు కూడా బాగున్నాయి.

 

దర్శకత్వం:

సినిమాలో అందరికంటే (తారాగణం కంటే కూడా) ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు కృష్ణవంశీ గురించి. ఈ సినిమాతో కృష్ణవంశీ బ్యాక్ వచ్చాడన్న ప్రశంసలు వ్యక్తమవడం ఖాయం. ఆయన రాసుకున్న కథ, స్క్రీన్‌ప్లే బాగుంది. టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి చూసే ఆనందించే సినిమాను మనకు అందించాడు. ఇలాంటి సినిమాలు చేయడం కృష్ణవంశీకే సాధ్యం అన్నంత గొప్పగా సినిమాను మలిచాడు. ప్రతి ఫ్రేమ్‌ను చక్కగా మలిచాడు. ఒకవిధంగా చెప్పాలంటే మంచి కుటుంబ కథాచిత్రం అనే శిల్పాన్ని చెక్కాడు అన్నంతగా తీశాడు. లవ్+ఎంటర్‌టైన్‌మెంట్+సెంటిమెంట్+ఎంజాయ్‌మెంట్ ఇలా అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరాయి. ఈ ఘనత కృష్ణవంశీకే చెందుతుంది. 

 

ఫైనల్‌గా…

చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి కుటుంబ బాంధవ్యాలు-కుటుంబ విలువలను చాటి చెప్పే చిత్రం తీసిన కృష్ణవంశీ, నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు ఈ సినిమాలో తన ఇమేజ్‌ను పక్కనపెట్టి నటించిన హీరో రాంచరణ్‌ను మెచ్చుకోవాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని మనం ఆశించాలి. అయితే సినిమాలో సెకండాప్ స్లో అవుతుంది. తొలి భాగంలో ఉన్న బిగింపు, గ్రిప్పింగ్ సెకండాప్‌లో తగ్గింది. అక్కడ కామెడీ చాలా చోట్ల మిస్సయ్యింది. అలాగే శ్రీకాంత్-కమలిని ముఖర్జి మధ్య లవ్‌ట్రాక్ ఎంతోసేపే లేదు. అలాగే విలన్లు చివరకు ఏమయ్యారో ఎవ్వరికి తెలియకుండానే వదిలేశారు. ఇలా చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే సినిమా ఆద్యంతం చక్కగా ఆకట్టుకుంటుంది. సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తే మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దసరా సీజన్ దృష్ట్యా పోటీ సినిమాలు కూడా లేకపోవడం కలిసొస్తుంది. యూత్, స్టూడెంట్స్, ఫ్యామిలీ, తాతా మనవళ్లు, బావా మరదళ్లు, తల్లిదండ్రులు ఇలా విడివిడిగా లేదా అందరూ కలిసివెళ్లి హాయిగా సినిమా చూసి రావొచ్చు.