గుణ 369 ట్రైలర్ టాక్.. మాస్ యాక్ష‌న్ తో ర‌ప్ఫాడించిన కార్తికేయ‌.. 

గుణ 369 ట్రైలర్ టాక్.. మాస్ యాక్ష‌న్ తో ర‌ప్ఫాడించిన కార్తికేయ‌..

కొన్ని సినిమాలు మొద‌లైన‌పుడు పెద్ద‌గా ఆస‌క్తి పుట్టించ‌వు. ట్రైల‌ర్ కానీ టీజ‌ర్ కానీ విడుద‌లైన‌పుడు మాత్రం వాటి గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇలా మాట్లాడుకునేలా చేస్తున్న సినిమా గుణ 369. ఆర్ఎక్స్ 100 సినిమాతో గతేడాది తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన కార్తికేయ ఇప్పుడు మ‌రోసారి మాస్ అవ‌తారంలోకి మారిపోయాడు. అప్పుడు ప్రేమ‌క‌థ‌తో వ‌చ్చిన ఈ హీరో ఇప్పుడు మాస్ హీరోగా మారే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే కొత్త ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల తెర‌కెక్కిస్తున్న గుణ 369లో ప‌క్కా మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు కార్తికేయ‌. ఆగ‌స్ట్ 2న విడుద‌ల కానుంది ఈ చిత్రం. తాజాగా బోయ‌పాటి, అల్లు అర‌వింద్ చేతుల మీద విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ముఖ్యంగా గొడ‌వ ప‌డితే వ‌చ్చేదేం ఉండ‌దు.. గొడ‌వ మాత్ర‌మే వ‌స్తుంది.. అంటూ ద‌ర్శ‌కుడు చెప్పిన లైన్ ను బ‌ట్టి సినిమా ఎలా ఉండ‌బోతుందో ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది.
ప్రేమ కోసం.. స్నేహం కోసం గొడ‌వ‌కు వెళ్లి చివ‌రికి హీరో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు అర్జున్. క‌చ్చితంగా ఈ చిత్రంతో కార్తికేయ మ‌రోసారి బాక్సాఫీస్ ను దున్నేయ‌డం ఖాయం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సీనియ‌ర్ న‌టుడు ఆదిత్య మీన‌న్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నాడు. అన‌ఘ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో రేపు సినిమాకు కూడా ఇదే స్పంద‌న వ‌స్తుందంటున్నారు చిత్ర‌యూనిట్. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో బిజినెస్ కూడా ఊపందుకుంది. ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తైపోయింది. దాంతో కార్తికేయ అండ్ టీం ఫుల్ హ్యాపీగా క‌నిపిస్తున్నారు. ఇక సినిమా వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేయ‌డ‌మే త‌రువాయి. మ‌రి ఈ చిత్రంతో కార్తికేయ మ‌రోసారి ర‌చ్చ చేస్తాడో లేదో చూడాలిక‌.