తెలంగాణ ద్రోహి చంద్ర‌బాబు…పాల‌మూరు లేఖ‌పై హ‌రీష్ నిప్పులు

తెలంగాణ ద్రోహి చంద్ర‌బాబేన‌ని , పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కేంద్ర జ‌ల‌వ‌నరుల సంఘానికి లేఖ రాయడం అంటే ఇక్క‌డి అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మేనని మంత్రి హ‌రీశ్ రావు మండిప‌డ్డారు. తొమ్మిదేళ్ల పాటు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు చేసేందేమి లేదని దుయ్య‌బ‌ట్టారు. ఇప్పుడు తెలంగాణ సిఎం కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శ్రీకారం దిద్దుతుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

వాస్త‌వానికి ఉమ్మడి రాష్ట్రానికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 2013 ఆగ‌స్టు ఎనిమిదిన జీవో నంబ‌ర్ : 72ను జారీ చేశారని తెలిపారు. ఆ జీవో ప్రకారమే కేసీఆర్ ప్రాజెక్టును నిర్మించతలపెట్టారని అన్నారు. ఏపీలో మూడో పంట కోసం పట్టిసీమ ప్రారంభించిన చంద్రబాబు.. తెలంగాణలో ఒక్క పంట కోసం కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశ‌పూర్వ‌కంగా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.