నా స్థానం ప్రస్తుతం జీరోనే – హీరో నాగ శౌర్య

విభిన్నమైన సినిమాలతో క్యారెక్టర్ కు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తున్న హీరో నాగ శౌర్య. జాదుగాడు తరహా మాస్ చిత్రాల కంటే కూడా ప్రేమతో కూడిన చిత్రాలకే తన ప్రాధాన్యమంటున్నాడు. అబ్బాయితో అమ్మాయి చిత్రంతో తనకు సెంకడ్ ఇన్నింగ్స్ మొదలవుతున్నట్టు చెప్పాడు. 2016లో నాగ శౌర్య నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో నటించిన అబ్బాయితో అమ్మాయి జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర హైలైట్స్ గురించి మనతో షేర్ చేసుకున్నాడు.

ఇక ప్రేమ కథా చిత్రాలే….
నాకంటూ ఓ ఇమేజ్ లేదు. పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలే ఎంచుకుంటున్నాను. జాదుగాడు విషయంలో తప్పు జరిగిందని భావిస్తున్నాను. నా పాత్ర వరకు బాగానే చేసినప్పటికీ నా కెరీర్ ప్రారంభంలోనే ఈ తరహా చిత్రం చేయకూడదని అనిపించింది. చాలా మంది కూడా ఇదే విషయం చెప్పారు. అందుకే ప్రేమ కథా చిత్రాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నాను. అబ్బాయితో అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ కథ. దీని తర్వాత వస్తున్న కళ్యాణ వైభోగమే పెళ్లి తర్వాత ప్రేమ కథ. ఆ తర్వాత ఒక మనసు విభిన్నమైన మెచూర్డ్ ప్రేమ కథ. జో అచ్యుతానంద కుటంబ ప్రేమ కథ. 2016లో నాలుగు చిత్రాలతో మీ ముందుకు రాబోతున్నాను.

అబ్బాయితో అమ్మాయి తర్వాత నా కెరీర్….
2016 నాకు మంచి సంవత్సరంగా కనిపిస్తోంది. ఎందుకంటే అబ్బాయితో అమ్మాయి చిత్రం నా కెరీర్ కు చాలా ప్రత్యేకం. ఓ మంచి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో కూడా ప్రేమ కథ ఉంటుంది. ఇది ఓ రకం ప్రేమ కథ. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూడతగ్గ చిత్రం. రమేష్ వర్మ చాలా కేర్ తీసుకొని రూపొందించారు. అబ్బాయితో అమ్మాయి… బి, సి సెంటర్స్ లో కూడా అద్భుతంగా ఆడుతుంది. ఎందుకంటే ప్రేమ ఎక్కడైనా ఒకటే. ఫేస్ బుక్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఫేస్ బుక్ వాడుతున్నారు. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ ప్రేమ కథ ఉంటుంది. రిచ్ కుర్రాడిగా కనిపిస్తానిందులో. దర్శకుడు రమేష్ వర్మ పోస్టర్ డిజైనింగ్ లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆ విషయంలో ఆయన్ని మించిన వారు లేరు. అలాగే చిత్రాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇళయరాజా గారి మ్యూజిక్ ఈ చిత్రానికి స్పెషల్. రీ రికార్డింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.

నేనింకా జీరోనే….
యంగ్ హీరోల్లో నా స్థానం ఇంకా జీరోనే అనుకుంటున్నాను. అందుకే 2016నుంచి ప్రారంభించబోతున్నాను. అబ్బాయితో అమ్మాయి నుంచి ఓ మెట్టు ఎక్కుతాననుకుంటున్నాను. రాబోయే నాలుగు చిత్రాలు కూడా నాకో స్థానం ఇస్తాయని ఆశిస్తున్నాను.