అనుకున్నంత ప‌ని చేసిన రాజ్ త‌రుణ్..

మొద‌టి సినిమా హిట్.. ఆ ఏదో గాలివాటం.. ఇలా సింగిల్ మూవీ వండ‌ర్ ల‌ని ఎంత‌మందిని చూడ‌లేదు అనుకున్నారంతా.. క‌ట్ చేస్తే..

రెండో సినిమా కూడా హిట్.. అదృష్టం క‌లిసొచ్చిందిలే.. నిల‌బ‌డితే చూద్దాంలే అనుకున్నారు..

ఇప్పుడు మూడో సినిమా కూడా హిట్.. అమ్మో ఈ కుర్రాడు క‌నిపించేంత అమాయ‌కుడేం కాదు.. కాస్త సీరియ‌స్ గా తీసుకోక‌పోతే అస‌లుకే మోసం వ‌చ్చేలా ఉందే అనుకుంటున్నారు. ఆ కుర్రాడే రాజ్ త‌రుణ్. కుమారి 21 ఎఫ్ తో హ్యాట్రిక్ కొట్టి.. మ‌హా మ‌హా వార‌సుల‌కే సాధ్యం కాని రికార్డుని సొంతం చేసుకున్నాడు.

ఈ కుర్రాడి పేరు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో ఏ స‌పోర్ట్ లేకుండా మంచి రైజింగ్ లో ఉన్న హీరో ఈ కుర్రాడొక్క‌డే. రీసెంట్ గా కుమారి 21 ఎఫ్ తో రాజ్ త‌రుణ్ రొట్టె విరిగి నేతిలో ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నోడు సినిమాకు ఎంత తీసుకున్నాడో క్లారిటీ లేదు గానీ ఇక‌పై మాత్రం కోటికి త‌క్కువ తీసుకోడ‌నేది మాత్రం ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న లెక్క‌. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా, తాజాగా కుమారి 21 ఎఫ్.. న‌టించిన మూడు సినిమాలు 10 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసాయి(కుమారి 10 కోట్ల మార్క్ కు ద‌గ్గ‌ర్లో ఉంది). ఫుల్ ర‌న్ లో కుమారి దాదాపు 15 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా.

రాజ్ త‌రుణ్ ను హీరోగా మాత్ర‌మే లెక్కేస్తే ప‌ప్పులో కాలేసిన‌ట్లే.. మ‌నోడిలో స‌క‌ల క‌ళ‌లు ఉన్నాయి. ద‌ర్శ‌కుడు అవ్వాల‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు రాజ్ త‌రుణ్. అయితే నాని, ర‌వితేజ మాదిరే అదృష్టం లాగిత‌న్నే స‌రికి హీరో అయిపోయాడు. పైగా హిట్లొచ్చేస‌రికి స్టార్ అయిపోయాడు. ప్ర‌స్తుతానికి హీరోగా న‌టిస్తున్నా.. మ‌నోడి డ్రీమ్స్ అన్నీ ద‌ర్శ‌కుడి చైర్ పైనే ఉన్నాయి. రాజ్ త‌రుణ్ సినిమాల్లోకి రాక‌ముందు డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లోనే ప‌నిచేసాడు. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాడు.. తీసాడు. ఇక తొలి సినిమా ఉయ్యాలా జంపాలాకు కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసాడు. పైగా ఆ సినిమా స్క్రీన్ ప్లే విష‌యంలోనూ మ‌నోడి హ్యాండ్ ఉంది. ఇక ఇప్పుడంటే హీరోగా బిజీ అయ్యాడు గానీ ఖాళీగా ఉన్న టైమ్ లో సునీల్, అల్లుఅర్జున్ లాంటి హీరోల కోసం క‌థ‌లు కూడా రాసాడు ఈ హీరో. అవ‌కాశం దొరికితే సినిమ డైరెక్ష‌న్ చేస్తానంటూ ధీమాగా చెబుతున్నాడు రాజ్ త‌రుణ్. ప్ర‌స్తుతానికి ఏడాది వ‌ర‌కు హీరోగా బిజీ. త‌ర్వాత కాలం క‌లిసొస్తే మెగాఫోన్ ప‌డ‌తానేమో అంటున్నాడు ఈ కుర్ర హీరో.