ఆ పాత్ర ఆమెను కదిలించింది – హీరోయిన్ నిధి అగర్వాల్

నిధి అగర్వాల్…. ఇప్పుడు యువ హీరోల ఆరాధ్య కథానాయిక. వరుసగా అవకాశాలా సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది. తాజాగా పూరీజగన్నాథ్ సినిమాలో రామ్ సరసన నటించనుంది. మిస్టర్ మజ్ను సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ చెప్పిన ముద్దు మాటలు మీకోసం. ఆమె మాటల్లోనే…

‘‘నా సినిమాలు చూశాక… నా నటనలోని తప్పొప్పుల గురించి చర్చించడం మా అమ్మకి అలవాటు. కానీ నిక్కీ పాత్రలో నా నటనని చూస్తూ అమ్మ ఏడ్చారట. నా నటన అమ్మని అంతగా కదిలించడం ఎంతో సంతృప్తినిచ్చింది. తెరపై అందంగా కనిపించడమే కాదు, అభినయం పరంగానూ మెప్పించాలనేదే నా లక్ష్యం. ‘మిస్టర్‌ మజ్ను’లో నేను పోషించిన నిక్కీ పాత్ర చాలా సవాల్‌తో కూడుకొన్నది. సహజంగా నటించేందుకు ప్రయత్నించా. ముఖ్యంగా విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు చాలా సంఘర్షణతో కూడుకొని ఉంటాయి. అక్కడ నా అభినయం చాలా బాగుందని మెచ్చుకొంటున్నారంతా. మా అమ్మ అయితే ఆ సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టుకొన్నారట. అలాంటి బలమైన పాత్రలో నటించడం చాలా తృప్తినిచ్చింది. డ్యాన్స్‌ పరంగా కూడా నాకు తొలి చిత్రం నుంచీ మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. స్వతహాగా నేను డ్యాన్సర్‌ని. నాగచైతన్యతో చేసిన ‘సవ్యసాచి’తో నాకు మంచి పేరొచ్చింది. ‘మిస్టర్‌ మజ్ను’తో ప్రేక్షకులకు చేరువ కావడం ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలో మరో భిన్నమైన పాత్రని చేస్తున్నా. నిక్కీతో పోలిస్తే ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో అందులో కనిపిస్తా. అమాయకత్వంతో పాటు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలూ చేయాలనుంది. అందంగా కనిపిస్తూనే, అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలపైనే నా దృష్టి. హాలీవుడ్‌లో జెన్నిఫర్‌ లారెన్స్‌ అంటే బాగా ఇష్టం. భారతీయ నటుల్లో శ్రీదేవి, అనుష్క, మాధురీ దీక్షిత్‌, దీపికా పదుకొనే నా అభిమాన తారలు. సమంత కూడా ఇష్టమే. వీళ్లంతా గ్లామర్‌తోపాటు అభినయ ప్రధానమైన పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. చిన్నప్పట్నుంచీ నటిని అవ్వాలనే ఉండేది. మా అమ్మానాన్న నా అభిరుచిని ప్రోత్సహిస్తూ చదివిస్తూనే బాలే, కథక్‌ నృత్యాలు నేర్పించారు. పండిత్‌ వీరూ కృష్ణ, షాన్‌ నా గురువులు. ఓ వైపు చదువుతూనే మరోవైపు మోడలింగ్‌ చేశా. షబ్బీర్‌ఖాన్‌ తన ‘మున్నా మైఖేల్‌’ చిత్రంలో తొలి అవకాశాన్ని కల్పించారు. అందులో డ్యాన్స్‌కి సంబంధించిన సన్నివేశాలూ ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు నుంచి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో నా అభిమాన కథానాయకుడు రణబీర్‌ కపూర్‌. చిత్రీకరణలు లేకపోతే సినిమాలు చూస్తూ గడపడమే నా వ్యాపకం. సినిమా కాకుండా జంతువులంటే ఇష్టం. భవిష్యత్తులో ముప్ఫై, నలభై కుక్కలతో ఓ ఫామ్‌ని నిర్వహించాలని ఉంది. కూరగాయల పెంపకం కూడా ఇష్టమే’’. అని అన్నారు.