జంప్ జిలానీల‌పై చ‌ర్య‌లు ఉన్న‌ట్టా ? లేన‌ట్టా : హైకోర్టు సూటి ప్ర‌శ్న

పార్టీ ఫిరాయింపుదారుల‌పై చర్య‌లు తీసుకునేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో స్పీక‌ర్‌ను అడిగి చెప్పాల‌ని తెలంగాణ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ రామ‌కృష్ణారెడ్డికి హైకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ఎంత సమయం కావాలో స్పీక‌ర్‌ను అడిగి చెప్పాలని తెలంగాణ ఏజీ రామకృష్ణా రెడ్డిని హైకోర్టు గురువారం ప్రశ్నించింది. ఫిరాయింపు నేతలపై వచ్చిన ఫిర్యాదులు చట్టసభల ముందు పెండింగులో ఉండగా హైకోర్టు న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటునే తాత్సారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

టీడీపీ టిక్కెట్ పై గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన శాసన సభ్యులు తలసాని శ్రీనివాస యాదవ్‌, తీగల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మా రెడ్డిపై చర్యలు తీసుకోనేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాదు త‌ల‌సానికి టీఆర్ ఎస్ మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంపైనా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు రేగుతున్నాయి. అంతేకాదు ఇటీవ‌ల వ‌ర్షాకాల విడిది నిమిత్తం హైద్రాబాద్ కు చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ దృష్టికి త‌ల‌సాని ఎపిసోడ్‌ను టీడీపీ నేత‌లు తీసుకువెళ్లారు. ఈ సంద‌ర్భంగా త‌ల‌సానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై ప్ర‌ణ‌బ్ విస్మ‌యం వ్య‌క్తంచేశార‌ని స‌మాచారం.

మరోవైపు కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరిపోయిన రెడ్యా నాయక్‌, యాదయ్య, కనకయ్య, విఠల్ రెడ్డిపై చర్యలకు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ విప్‌ ఎస్.ఎ. సంపత్‌కుమార్‌, అదేవిధంగా పార్టీ ఫిరాయింపు నేరానికి పాల్ప‌డ్డ ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లు, రిట్‌ అప్పీళ్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ స్పీకర్‌ వద్ద దాఖలైన వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిరాయింపు వ్యాజ్యాలపై స్పీకర్‌ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రస్తావించారు. దీనిపై ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది. ఒక‌వేళ పార్టీ ఫిరాయింపుదారుల‌పై స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకుంటే మ‌రికొన్ని అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు త‌ప్పేలా లేవు.