హిప్పీ మూవీ రివ్యూ

హిప్పీ మూవీ రివ్యూ

ఆర్.ఎక్స్ 100 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తర్వాత హిప్పీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తమిళ దర్శకుడు టి.ఎన్.కృష్ణ చెప్పిన కథకు ఓకే చేశాడు. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి.ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించడంతో హైప్ క్రియేట్ అయ్యింది. అదీకాకుండా చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి ఇందులో కీలక పాత్రలో నటించారు. డిఫరెంట్ ట్రైలర్స్, లుక్స్ అప్పీయరెన్స్ ఈ సినిమాకు క్రేజ్ ను తీసుకొచ్చాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థేంటంటే:
హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఎప్పుడు ఏద‌నిపిస్తే అది చేస్తూ, స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే ర‌కం. ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ)తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. స్నేహ (జ‌జ్బాసింగ్‌) త‌న‌ని ప్రేమిస్తున్నా, ఆమెను కాద‌ని వెంటప‌డి మ‌రీ ఆముక్త మాల్యద మ‌న‌సు గెలుచుకునేందుకు ప‌రిత‌పిస్తాడు. ఆమె చుట్టూ తిరిగేంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె తిరిగి ప్రేమించ‌డం మొద‌లు పెడుతుందో అప్పట్నుంచి త‌న స్వేచ్ఛని కోల్పోయిన‌ట్టుగా భావిస్తాడు హిప్పీ. మ‌రి వారి ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళ్లిందా? లేదా? వీరి ప్రేమ‌క‌థ‌ని హిప్పీ బాస్ అయిన అర‌వింద్ (జేడీ చ‌క్రవ‌ర్తి) ఎలాంటి మ‌లుపు తిప్పాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
మ‌నం ప్రేమిస్తే ఆ అనుభూతి స్వర్గంలోకి వెళ్లిన‌ట్టుగా ఉంటుంది. తిరిగి మ‌న‌ల్ని ప్రేమిస్తే స్వర్గం కోల్పోయిన‌ట్టుగా ఉంటుందనే అంశం చుట్టూ అల్లిన క‌థ ఇది. ప్రేమలో ప‌డ్డాక అమ్మాయి పెట్టే షరతులు, ఆమెకి న‌చ్చిన‌ట్టుగా బ‌త‌కాల్సి రావ‌డం, అందుకోసం ప‌డే తాపత్రయపడటం వంటి విష‌యాల‌న్నీ కూడా కుర్రాళ్ల స్వేచ్ఛని హ‌రించిన‌ట్టు ఉంటాయ‌ని.. ఆ ద‌శ‌లో ప్రేమ‌ని అర్థం చేసుకోవడ‌మే ముఖ్యం అన్న విష‌యాన్ని దర్శకుడు త‌నదైన శైలిలో చెప్పాడు. కుర్రాళ్ల ఆలోచ‌న‌ల‌కి అద్దం ప‌ట్టే క‌థ ఇది. ఒక చిన్న అంశాన్ని ఎంచుకొని, దాన్ని క‌థ‌గా మ‌లిచే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. క‌థ కంటే కూడా క‌థ‌న‌మే కీల‌కం. అయితే ఇందులో సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని విష‌యాలు చాలా ఉంటాయి. ప్యార‌డైజ్‌, ఎరెక్షన్‌, ఇంపొటెంట్ అంటూ మ‌ల్టీప్లెక్స్ ప్రేక్షకులు మాత్రమే అర్థం చేసుకొనే విష‌యాలున్నాయి. ఆరంభ స‌న్నివేశాలు మొదలుకొని ప్రధమార్ధం సర‌దాగానే సాగిపోతుంది. అక్కడక్కడా సంభాష‌ణ‌లు ద్వంద్వార్థాల‌తో వినిపించినా… కామెడీ, రొమాన్స్‌, యాక్షన్‌ అంశాల‌తో ద్వితీయార్ధంలోకి అడుగుపెడుతుంది. ఆ త‌ర్వాత క‌థ కూడా ఇంట్రస్టింగ్ గా ముందుకెళ్తుంది.
క్లైమాక్స్ పార్ట్ ఇంట్రస్టింగ్ గాఉంటుంది. క‌థ‌లో మ‌లుపు కోస‌మ‌ని ప్లాన్ చేసిన జేడీ పెళ్లి తంతు ఫన్నీగా ఉంటుంది. జెడి పెళ్లి సన్నివేశాల్ని ప్రేక్షకులు ఊహించరు. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ క్రేజీగా ఉంటాయి. వాళ్లిద్దరు కొట్టుకునే సన్నివేశం ఆ తర్వాత వచ్చే రొమాంటిక్ సీన్స్ ఎరోటిక్ గా ఉంటాయి.

నటీనటుల పెర్ ఫార్మెన్స్…

కార్తికేయ కొత్తగా ట్రై చేశాడు. హుషారుగా సాగే పాత్ర. న‌ట‌న హుషారుగా సాగుతుంది. ‘ఆర్‌ఎక్స్‌100’లో చేసిన పాత్రకి భిన్నంగా మ‌రింత ఉత్సాహంగా క‌నిపించాడు. హిప్పీ పాత్రలో చ‌క్కగా ఒదిగిపోయాడు. కార్తికేయ సిక్స్‌ప్యాక్‌ దేహాన్ని చూపించడంపైనే మ‌రీ ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టున్నారు. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘ఆర్ఎక్స్‌100’ని మ‌రోసారి గుర్తు చేశాడు హీరో. దిగంగ‌న అందం, న‌ట‌న చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. ఆమె ప్రతీ స‌న్నివేశంలో అందంగా క‌నిపించారు. ద్వితీయార్ధంలో ఆమె న‌ట‌న కూడా మెప్పిస్తుంది. బాస్ అర‌వింద్ పాత్రలో జేడీ చ‌క్రవ‌ర్తి ఒదిగిపోయారు. తెలంగాణ యాస మాట్లాడుతూ ఆయ‌న పండించిన హాస్యం మెప్పిస్తుంది. జ‌జ్బాసింగ్‌, శ్రద్ధా దాస్ చిన్న పాత్రల్లో మెరిశారు. వెన్నెల‌ కిషోర్ పాత్రతో కామెడీ పండించారు. సినిమాకు బాగా ఉపయోగపడ్డాడు. సాంకేతికంగా సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో ఉంటుంది. నివాస్ కె.ప్రస‌న్న స‌మ‌కూర్చిన బాణీలతో పాటు నేప‌థ్య సంగీతం బాగుంది. రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన బ‌లం. ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణాత్మక విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా..
హిప్పీ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్. స్టైలిష్ మేకింగ్, హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ ఆడియెన్స్ ని మెప్పిస్తాయి. న్యూ ఏజ్ ట్రెండీ ఫిల్మ్. యూత్ ఆడియెన్స్ ని బాగా మెప్పించే సినిమా. టార్గెట్ ఆడియెన్స్ ని శాటిస్ ఫై చేసే సినిమా ఇది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5