హిప్పీ డైరెక్టర్ టి ఎన్ కృష్ణ ఇంటర్వ్యూ

‘‘సామాజిక మాధ్యమాల యుగంలో ఉన్నాం. అందుకు తగ్గట్టే సినిమాలు రూపొందుతున్నాయి. ఏ రంగంలోనైనా కాలానికి తగ్గట్టు మారాల్సిందే. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే మేం తీస్తున్నాం’’ అన్నారు టి.ఎన్‌ కృష్ణ. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘హిప్పీ’. కార్తికేయ కథానాయకుడు. కలైపులి థాను నిర్మాత. ఈ నెల 6న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు టి.ఎన్‌ కృష్ణ.

‘‘కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాని చూశా. ఆ తర్వాత అతణ్ని కలిసి ఓ కథని వినిపించా. జాన్‌ మిల్టన్‌ రాసిన ‘పేరడైజ్‌ లాస్‌’ పోయమ్‌ ప్రేరణతో రాసిన కథ అది. కార్తికేయ కథ విన్నాక కొత్తగా ఉందన్నారు. ఆ తర్వాత ఈ కథని నిర్మాత థానుకి వినిపించా. ఆయనకీ నచ్చడంతో తెరకెక్కింది. అంతే తప్ప ఇది ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం నుంచి పుట్టిన కథ కాదు. నా జీవిత  అనుభవాలు కూడా ఈ కథలో ఉన్నాయి. ప్రేమని అనుభవించకపోతే, ప్రేమకథను అందంగా చెప్పలేమనేది  నా అభిప్రాయం’’.

హిప్పీ అంటే?: ‘‘మనసుకి ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది చేసేస్తూ సంతోషంగా గడిపేవాడినే ‘హిప్పీ’ అంటారు. అలాంటి ఓ కుర్రాడి చుట్టూ తిరిగే రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. కార్తికేయ బాక్సర్‌గా, కథానాయిక దిగంగన బైకర్‌గా కనిపిస్తారు.   ప్రేమ లేనిదే జీవితం లేదని చెప్పే ప్రయత్నం చేశాం. ఈ తరం  ప్రేమికులు అధునాతన సాంకేతిక  పరికరాలిచ్చే సౌకర్యాలతో ఎలాంటి పోకడలు పోతున్నారనేది ఈ సినిమాలో కీలకం. ఈ తరహా ప్రేమకథా చిత్రాన్ని తెరపై ప్రేక్షకులు చూసి ఉండరని అనుకుంటున్నా’’.

కొత్త చిత్రాల కబురు..: ‘‘తమిళంలో మూడు సినిమాలు చేశా. వాటిలో ఒకటి విడుదల కాలేదు. నా తొలి చిత్రంలో సూర్య, జ్యోతిక జంటగా నటించారు. అది ‘నువ్వు నేను ప్రేమ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకి బాగా  చేరువైంది. తెలుగులో చేస్తున్న నా తొలి సినిమా ఇది. నిర్మాత థాను తదుపరి నా దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రాన్ని తీసేందుకు సిద్ధమయ్యారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలోనూ ఓ సినిమా చేయబోతున్నా. అది గ్లోబల్‌ కాన్సెప్ట్‌తో కూడిన చిత్రం. ఇకపై నా నుంచి చాలా చిత్రాలు వస్తాయి’’.