మళ్లీ అదే కథను తీయను… త్వరలోనే హుషారు వేడుక – డైరెక్టర్ శ్రీ హర్ష

ఈ మధ్య కాలంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన హుషార్ చిత్రం సూపర్ హిట్ గా దూసుకెళ్లి యాభై రోజుల పండగ చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ సాధించిందీ చిత్రం. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన శ్రీ హర్ష తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ…

‘‘మా లక్ష్యం యువతరం ప్రేక్షకులే. మేం ఊహించినట్లుగానే యువతరం ఒకటికి రెండుసార్లు చూశారు. అగ్ర కథానాయకుల చిత్రాల్ని తట్టుకొని మరీ మా చిత్రం యాభై రోజులకి చేరువ కావడం ఆనందంగా ఉంది. సినిమాలోని ఏదో ఒక పాత్రతో కనెక్ట్‌ అయిపోయారు ప్రేక్షకులు. ముందు నుంచీ ఈ చిత్రం తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్మాను. ఈ స్థాయి విజయాన్ని మాత్రం ఊహించలేదు. 12 సార్లు చూశామని చెప్పిన వాళ్లూ ఉన్నారు. విడుదలైన తొలి రెండు రోజులు 30 శాతం మంది ప్రేక్షకులే కనిపించారు. ఆ తర్వాత రోజు చూస్తే హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించాయి. త్వరలోనే యాభై రోజుల వేడుకని నిర్వహించబోతున్నాం. దర్శకుడిగా ఇదే నాకు తొలి సినిమా. కథ చెప్పగానే నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ చేయడానికి ఒప్పుకొన్నారు. కానీ ఆ తర్వాత నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం రెండేళ్లు ప్రయాణం చేశాం. పరిమితమైన బడ్జెట్‌తో డబ్బులు సమకూరినప్పుడే నెలకి ఐదు రోజులు చొప్పున చిత్రీకరించి సినిమాని పూర్తి చేశాం. ‘ఇలాంటి సినిమా ఎలా ఆడుతుంద’ని చాలా మంది అన్నారు. కానీ నేను, మా చిత్రబృందం కథని నమ్మాం. నా జీవితంలో నుంచి వచ్చిన కథే ఇది. హిందీ, తమిళంలోనూ రీమేక్‌ అవుతోంది. నన్నే దర్శకుడిగా అడిగారు. కానీ మళ్లీ అదే కథని తీయడం నాకే నచ్చలేదు. ప్రస్తుతం సరదా ఆలోచనలతో సాగే ఓ స్క్రిప్టుని సిద్ధం చేస్తున్నా. త్వరలోనే ఆ సినిమా వివరాల్ని ప్రకటిస్తా. అని అన్నారు.