ఇది వ‌ర్ష‌మా నాన్న‌.. ఎక్క‌డ నాయ‌నా..!

వ‌ర్షం.. ప్ర‌భాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. 2004లో శోభ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌భాస్, గోపీచంద్, త్రిష‌.. ఇలా అంద‌రి కెరీర్స్ ను మ‌లుపు తిప్పింది ఈ చిత్రం. ప్ర‌భాస్, త్రిష వ‌ర్షం త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. అంత స్ట్రాంగ్ గా బ్రేక్ ఇచ్చింది ఈ చిత్రం. ఇంత‌టి చ‌రిత్ర ఉన్న సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేసారు. బాఘీ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ష‌బ్బీర్ ఖాన్ రూపొందించాడు. టైగ‌ర్ ష్రాఫ్, శ్రద్ధాక‌పూర్ ఇందులో జంట‌గా న‌టించారు. విల‌న్ గా తెలుగు న‌టుడు సుధీర్ బాబు న‌టించ‌డం విశేషం.

తాజాగా బాఘీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఏ కోశానా వ‌ర్షం ఛాయ‌లు ఇందులో క‌నిపించ‌ట్లేదు. అస‌లు వ‌ర్షం నుంచి ఏ క‌థ తీసుకున్నారో తెలియదు గానీ ఇక్క‌డ మ‌న తెలుగు వ‌ర్షం చ‌క్క‌టి ప్రేమ‌క‌థ అయితే.. అక్క‌డ మాత్రం మార్ష‌ల్ ఆర్ట్స్ సినిమా. చైనీస్, జ‌ప‌నీస్ సినిమా చూసిన‌ట్లే ఉంది బాఘీ ట్రైల‌ర్ చూస్తుంటే. టైగ‌ర్ ష్రాఫ్ త‌న‌కు తెలిసిన మార్ష‌ల్ ఆర్ట్స్ విద్య‌ల‌న్నీ ఈ సినిమాలో చూపించేసాడు. ప‌నిలో ప‌నిగా శ్ర‌ద్ధాక‌పూర్ కూడా బికినీతో పాటు త‌న యాక్ష‌న్ స్టంట్స్ అన్నీ కెమెరా ముందు ప‌రిచేసింది. సుధీర్ బాబు కూడా త‌క్కువేం తిన‌లేదు. ఆయ‌న కూడా త‌న విద్య‌ల్ని ప్ర‌దర్శించాడు. వ‌ర్షం క‌థ‌తో అస‌లేమాత్రం సంబంధం లేని ఈ రీమేక్ కాని రీమేక్ ఎప్రిల్ 29న థియేట‌ర్స్ లోకి రానుంది. మ‌రి చూడాలిక‌.. బాఘీ ప్రేక్ష‌కుల‌ను సంతోష పెడుతుందో.. లేదంటే బాధ పెడుతుందో..?