టీం ఇండియా రికార్డు విజయం…ధావన్ సెంచరీ ఐర్లండ్ చిత్తు

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో టీం ఇండియా రికార్డు విజయం సాధించింది. ఐర్లండ్‌తో జరిగిన గ్రూఫ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 259 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఐర్లండ్‌లో పోర్టర్‌ఫీల్డ్ 67, నీల్ ఒబ్రెయిన్ 75, స్లిర్లింగ్ 43 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. 

260 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఓపెనర్ శిఖర్‌ధావన్ సెంచరీ(84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో) సాధించడంతో పాటు రోహిత్‌శర్మ అర్థ సెంచరీ సాధించడంతో కేవలం వీరిద్దరి వికెట్లు కోల్పోయి మరో 79 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 

దీంతో ప్రపంచకప్‌లో వరుసగా ఐదో విజయం సాధించింది. ఇది ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్‌కు వరుసగా తొమ్మిదో విజయం. 2011లో భారత్ వరుసగా చివరి నాలుగు మ్యాచ్‌ల్లోను ఓడిపోకుండా గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. 2003లో గంగూలీ నేతృత్వంలో భారత్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పుడు ధోనీ సేన ఈ రికార్డును చెరిపేసింది. తాజా విజయంతో భారత్ గ్రూఫ్‌లో టాపర్‌గా నిలిచింది. భారత్ తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వేతో ఆడుతుంది. సెంచరీ హీరో శిఖర్‌ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.