కటక్ వన్డేలో భారత్ అదుర్స్-చేతులెత్తేసిన శ్రీలంక

ఐదు వన్డేల సీరీస్‌లో భాగంగా కటక్‌లో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 169 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు అజ్యంకా రహానే(109), శిఖర్ ధావన్(113) శుభారంభం అందించారు. వీరు తొలి వికెట్‌కు 231 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం సురేష్ రైనా కూడా చెలరేగి అర్థసెంచరీ సాధించడంతో భారత నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 364 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక కేవలం 39.2 ఓవర్లలో 194 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మ 4 వికెట్లు, ఉమేష్‌యాదవ్, అక్షర్‌పటేల్‌కు చెరో రెండు వికెట్లు లభించాయి. శ్రీలంకలో మహేల జయవర్థనే 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వన్డేల్లో రహానే రెండో సెంచరీ, ధావన్ ఆరో సెంచరీ నమోదు చేసుకున్నారు. ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉంది. చాలా రోజుల తర్వాత భారత్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అన్ని విభాగాల్లోను మంచి ప్రదర్శన కనపరిచింది. వచ్చే సంవత్సరం జరిగే వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది.