పుష్క‌రాల స‌ర‌దా: గోదావ‌రిలో ఈత కొట్టిన తెలంగాణ మంత్రి

పుష్క‌ర గోదారిలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పుణ్య స్నాన‌మాచ‌రించి, కాసేపు స‌ర‌దా ఈత‌కొట్టారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా, కాళేశ్వ‌రం ఘాట్ వ‌ద్ద‌కు స‌తీస‌మేతంగా చేరుకున్న ఆయ‌న ఇక్క‌డి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. పుణ్య‌స్నానం అనంత‌రం కాళేశ్వర-ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుంభమేళా తరహాలో గోదావరి మహా పుష్కరాలు కొనసాగుతున్నాయన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలూ త‌లెత్త‌కుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని తెలిపారు.

గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు పూర్తి భిన్నంగా నేటి పుష్కరాలు ఉన్నాయన్నారు. కాగా ఘాట్ల వ‌ద్ద కాలుష్య నివారణకు బ్రహ్మకుమారి ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో శుక్రవారం నుంచే భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఐదు జిల్లాల్లో గురువారం ఒక్కరోజే ఆర్టీసీ 8,790 బస్సు సర్వీసులు నడిపింది. తొమ్మిది వేల ప్రైవేట్ వాహనాల్లో భక్తులు ఘాట్లకు వచ్చారని అధికారులు చెబుతున్నారు.