పూరీ జ‌గ‌న్నాథ్ బుర్ర‌క‌థ చెప్తున్నాడా..?

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా ర‌చ్చ జ‌రుగుతుంది. దానికి తోడు త‌మ సినిమా క‌థ‌ను లీక్ చేసారంటూ పూరీ కూడా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల ద‌గ్గ‌రికి వెళ్ల‌డంతో ఈ సినిమాకు ఫ్రీ ప‌బ్లిసిటీ వ‌స్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త కూడా బ‌య‌టికి వ‌చ్చింది. పూరీ జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్.. ఆది సాయికుమార్ బుర్ర‌క‌థ సినిమాల క‌థ ఒక‌టే అని అంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఉన్న లైన్ ఒక్క‌టే కావ‌డంతో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి మొదలైంది.
ఇస్మార్ట్ శంకర్ క‌థ ప్ర‌కారం హీరోకు రెండు మెద‌డులు ఉంటాయ‌ని.. అందులో ఒక‌టి సొంత బ్రెయిన్ అయితే మ‌రోటి చిప్ పెట్టి న‌డిపిస్తుంటార‌ట. ఇది ఎలా సాధ్యం అని మాత్రం అడక్కండి. పూరీ ఎలా మ్యాజిక్ చేశాడో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ అంతా కాస్త తిక‌మ‌క‌గా ఉంటుంద‌ని.. దాన్ని పూరీ త‌న స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.

అయితే ఇదే స‌మ‌యంలో ఆది సాయికుమార్ హీరోగా వ‌స్తున్న బుర్ర‌క‌థ‌లో కూడా రెండు మెద‌డులు ఉంటాయని టీజర్ లో క్లారిటీగా చెప్పేశారు. ఇక్క‌డ హీరోలోనూ రెండు పాత్రలుంటాయి. ఒక్కో పాత్ర ఒక్కోలా బిహేవ్ చేస్తూ… కామెడీ జెనరేట్ అవుతుందట. ఈ రెండు సినిమాల క‌థ దాదాపు ఒకేలా ఉండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా కంగారు ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. నాలుగేళ్ల కింద క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్.. ఎన్టీఆర్ టెంప‌ర్ క‌థ‌లు ఒకేలా ఉన్నాయి. త‌ర్వాత కూడా గ్రీకువీరుడు, సుకుమారుడు క‌థ‌లు సేమ్ టూ సేమ్ వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రోసారి పూరీ ఇస్మార్ట్ శంక‌ర్, ఆది బుర్ర‌క‌థ క‌థ‌లు ఒకేలా క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తుంది. ఇందులో బుర్ర‌క‌థ ముందు విడుద‌ల కానుండ‌టంతో పూరీ సినిమాకు టెన్ష‌న్ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. అన్నట్టు బుర్రకథ చిత్ర నిర్మాతలు ఇప్పటికే కోటిన్నర లాభంలో ఉన్నారట. జూన్ 28న బుర్రకథ రిలీజ్ అవుతుండగా… జులై 12న ఇస్మార్ట్ శంక‌ర్ విడుదల కానుంది.