రామ్ కు హ్యాండిస్తున్న దిల్ రాజు.. ఇస్మార్ట్ శంక‌ర్ ప‌రిస్ధితేంటి..? 

నైజాంలో దిల్ రాజు తీసుకుంటే నిర్మాత‌ల‌కు టెన్ష‌న్ ఉండ‌దు. ఆయ‌న చేయి ప‌డితే చాలు సినిమా హిట్ అనే న‌మ్మ‌కంతో ఉంటారు వాళ్లు. అందుకే నిర్మాత‌గానే కాకుండా బ‌య్య‌ర్ గా కూడా రాజుగారికి చాలా మంచి పేరుంది. ఈయ‌నకు ఎప్పుడెప్పుడు త‌మ సినిమా చూపిద్దామా అని వేచి చూస్తుంటారు నిర్మాత‌లు కూడా. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం జులై 18న విడుదల కానుంది. ప‌క్కా తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై పూరీ భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న ఈయ‌న‌కు ఈ సినిమా స‌క్సెస్ కావ‌డం కీల‌కంగా మారింది. మ‌రోవైపు రామ్ కు కూడా అంతే. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా చూడాలంటే దిల్ రాజును పూరీ జ‌గ‌న్నాథ్ ఆహ్వానించాడ‌ని తెలుస్తుంది. కానీ పూరీ ఆఫ‌ర్ కు ఆయ‌న నో చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 
దానికి ప్ర‌త్యేక కార‌ణం కూడా ఏం లేదు. అప్ప‌ట్లో పూరీ చేసిన మెహ‌బూబా సినిమాను దిల్ రాజే తీసుకున్నాడు. ఆయ‌నే విడుద‌ల చేసాడు కూడా. ఏపీ, తెలంగాణ‌లో ఈ చిత్రాన్ని కొన్న దిల్ రాజు నిండా మునిగిపోయాడు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌క‌పోవ‌డ‌మే కాకుండా ఇలాంటి సినిమాల‌ను తీసుకుని దిల్ రాజు ప్రేక్ష‌కుల్లో త‌న‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దాంతో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇస్మార్ట్ శంక‌ర్ పై కూడా ప‌డింది. అందుకే ఈ చిత్ర స్పెష‌ల్ షోకు కూడా దిల్ రాజు రానంటున్నాడ‌ని తెలుస్తుంది. నైజాంలో దిల్ రాజుకు ఇస్తే శంక‌ర్ సేఫ్ అవుతాడ‌ని పూరీ భావిస్తున్నా కూడా ఇప్పుడు ఈయ‌న తీసుకునేలా క‌నిపించ‌డం లేదు. దాంతో రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ కూడా రంగంలోకి దిగాడు. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలిక‌.