ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ

పూరీ జగన్నాథ్ ఓ మాంచి హిట్ సినిమా అందించేందుకు ట్రై చేస్తున్నాడు. టెంపర్ తర్వాత తన నుంచి వచ్చిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. అందుకే ఈసారి ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాంలోకి రావాలనుకుంటున్నాడు. రామ్ ని ఇందులో చాలా కొత్తగా చూపిస్తున్నాడు. తెలంగాణ యాసతో పక్కా ఊరమాస్ క్యారెక్టర్లో కనిపించాడు. ట్రైలర్ తర్వాత సినిమాలో ఏదో ఉందనే అంచనాలు క్రియేట్ చేయగలిగాడు. ఛార్మీ ఈ ప్రాజెక్టును దగ్గరుండి అన్నీ చూసుకుంది. మరి పూరి – రామ్‌ కలిసి మ్యాజిక్‌ చేయగలిగారా? మాస్‌లో రామ్‌ రేంజ్‌ ఈ సినిమాతో పెరిగిందా?పూరి మళ్లీ ట్రాక్‌ ఎక్కగలిగారా?

కథేంటంటే: శంకర్‌ (రామ్‌) ఓ కిరాయి రౌడీ. భయం, భక్తి రెండూ లేవు. డబ్బు కోసం ఓ హత్య కూడా చేస్తాడు. అయితే ఆ హత్య తరవాత.. రామ్‌ని పోలీసులు వెంటాడడం మొదలెడతారు. ఈ పోరులో తన ప్రాణానికి ప్రాణమైన చాందిని (నభా నటేషా)ని కోల్పోతాడు. తన ప్రేయసి చావుకి కారణమైన వాళ్ల కోసం శంకర్‌ గాలించడం మొదలెడతాడు. అయితే శంకర్‌ కూడా ఓ ప్రమాదంలో గాయపడి, సీబీఐకి దొరికేస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఓ పోలీస్‌ అధికారి (సత్యదేవ్‌)కి చెందిన మెమొరీ కార్డుని శంకర్‌ మెదడులో నిక్షిప్తం చేయాల్సి వస్తుంది. అలా ఎందుకు?ఆ తరవాత ఏమైంది? అనేదే మిగిలిన కథ.

సమీక్ష
పూరీ జగన్నాథ్ కి మాస్ సినిమా చేయడమంటేనే ఇష్టం. హీరో క్యారెక్టరైజేషనే మాస్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు. పూరిది ముందు నుంచీ మాస్‌ దారే. వాళ్లని మెప్పించడంపైనే దృష్టిపెడుతుంటారు. ఈసారి మెదళ్ల మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకున్నా, దాన్ని కూడా తనకు అలవాటైన దారిలోనే చెప్పాలని ప్రయత్నించారు. అసలు మెదళ్ల మార్పిడి సాధ్యమేనా? అనే విషయంపై ప్రేక్షకులకు ఎలాంటి అనుమానాలూ రాకుండా, టైటిల్స్‌ పడేటప్పుడే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రామ్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన బలం. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, దానికి కాస్త డోసు ఎక్కువ చేసి మరీ రామ్‌ పాత్రని రాసుకున్నారు. రామ్‌ మాటలు, చేష్టలూ మాస్‌కి నచ్చుతాయి. రామ్‌ కనిపించిన ప్రతి సన్నివేశం మాస్‌ కోసమే డిజైన్‌ చేశారు. దాంతో పాటు నభా నటేష్‌ పాత్ర కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు నడిపించుకుంటూ విశ్రాంతి ఘట్టం వరకూ తీసుకొచ్చేశారు. అక్కడ మెమొరీ మార్పిడి మొదలవుతుంది. ఒక్కడే ఇద్దరిలా ప్రవర్తిస్తుంటాడు. కథంతా దాని చుట్టూనే తిప్పుతూ, అందులోనే వినోదాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేశాడు.

నటీనటుల పెర్ ఫార్మెన్స్
మాస్‌కి దగ్గరవ్వాలన్నది రామ్‌ ప్రయత్నం. ఈ కథని ఎంచుకోవడానికి కారణం అదే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో తన లక్ష్యం నెరవేరింది. రామ్‌లోని ఎనర్జీ మొత్తం ఈ పాత్రలో కనిపిస్తుంది. నటుడిగా తనకు పరిపూర్ణమైన సంతృప్తి లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తానొక్కడే ఈ సినిమా మొత్తాన్ని నడిపించగలిగాడు. కథానాయికల పాత్రలు రెండూ గ్లామర్‌ కోసమే అన్నట్లుగా ఉన్నాయి. నభా పాత్రకైతే డోసు ఇంకాస్త ఎక్కువైంది. సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపిస్తాడు. షాయాజీ షిండేతో సహా మిగిలిన పాత్రలన్నీ రొటీన్‌గానే సాగుతాయి. మణిశర్మ పాటలు మాస్‌కి బాగా నచ్చుతాయి. అందులో రామ్‌ వేసిన స్టెప్పులు కూడా నచ్చుతాయి. నేపథ్య సంగీతంలోనూ మణి తనదైన మార్క్‌ చూపించారు. పూరి డైలాగులు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. తెలంగాణ యాసలో రాసిన సంభాషణలు కిక్‌ ఇస్తాయి. కొన్ని డైలాగులు సెన్సార్‌ కత్తెరలో కొట్టుకుపోయాయి.

ఓవరాల్ గా… ఇస్మార్ట్ శంకర్ ఇరగదీశాడనే చెప్పాలి. పూరీ జగన్నాథ్ వెయిట్ చేసిన మాస్ హిట్ అందించాడు. ఊర మాస్ క్యారెక్టర్లో రామ్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్ గ్లామర్ మరో ఆకర్షణగా నిలిచారు. పూరీ మార్క్ మాస్ స్టైల్లో సినిమానుతీసుకెళ్లి మెప్పించాడు. పూరీ టేకింగ్, డైలాగ్స్ సినిమాను నిలబెట్టాయి. ఓవరాల్ గా… ఈ శంకర్ ఊర మాస్ స్మార్ట్ శంకర్. గో అండ్ వాచిట్.