జనసేనానితో సిఎం భేటీ వెనక రహస్యమేంటి…

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సడన్ గా పవన్ చంద్రబాబును కలవడం వెనక ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏపి మంత్రి కామినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ను దగ్గరుండి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లారు. విజయవాడ లోని సిఎం కార్యాలయంలో వీరిద్దరు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు గన్నవరం ఏయిర్ పోర్టు తో పాటు.. సిఎం క్యాంపు కార్యాలయానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ హాజరు కాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్నందునే ఆయన హాజరు కాలేకపోయారు. అందుకే మర్యాద పూర్వకంగా సిఎంను కలిసేందుకు వచ్చారని చెబుతున్నారు. దీంతో పాటు భూసేకరణ, రాజధాని నిర్మాణానికి సంబంధించిన కొన్ని సూచనలు చేయనున్నారట. భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు, పరిణామాల గురించి చర్చించనున్నారు. అలాగే చాలా రోజులుగా పవన్ రైతులను కలిసి మాట్లాడుతున్నారు. వారి నుంచి వస్తున్న స్పందనను కూడా చంద్రబాబుకు పవన్ వివరించనున్నారట.