జెర్సీ మూవీ రివ్యూ

హీరో నాని కెరీర్ సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న టైంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, దేవదాస్ చిత్రాలు బ్రేకులు వేశాయి. అందుకే చాలా కేర్ ఫుల్ గా సబ్జెక్టులు ఎంచుకుంటున్న క్రమంలో ఒప్పుకున్న సినిమా జెర్సీ. మళ్లీ రావా సినిమాతో సక్సెస్ అందుకున్న గౌతమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అనిరుథ్ మ్యూజిక్ అందించాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఈ సినిమాపై నాని చాలా ధీమాగా కనిపించాడు. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే… నాని ఇందులో క్రికెటర్ గా, తండ్రిగా కనిపించాడు. 1980ల కాలం నాటి నేపథ్యం.
అర్జున్(నాని) ఓ క్రికెటర్.. సారా(శ్రద్ధా శ్రీనాథ్‌)ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. నేషనల్ టీంకు ఆడాలని బాగా కష్టపడతాడు. కానీ స్థానం సంపాదించలేకపోతాడు. దీంతో క్రికెట్ కి దూరం అవుతాడు. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కొన్ని కారణాలతో పోతుంది. దాని కోసం లాయర్ చుట్టూ తిరుగుతుంటాడు. సారా ఓ స్టార్ హోటళ్లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. వీరికి ఓ కొడుకు(నాని). అతనికి క్రికెట్ నేర్పిస్తుంటాడు. అదే సందర్భంలో తన బర్త్ డే గిఫ్ట్ గా జెర్సీ కావాలని అడుగుతాడు. కానీ తండ్రి కొనివ్వలేకపోతాడు. అక్కడి నుంచి అర్జున్ లైఫ్ మారిపోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలతో మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంటాడు. ఇండియాకు ఆడాలనేదే అతని కోరిక.

ఇంతకూ అర్జున్ క్రికెట్ ఎందుకు వదిలేశాడు. ఉద్యోగం ఎందుకు పోయింది. వేరే జాబ్ ఎందుకు చేయడు. జెర్సీ ఎందుకు కొనివ్వలేకపోతాడు. మళ్లీ క్రికెట్ ఆడాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు. ఇండియా జట్టులో స్థానం సంపాదించాడా లేదా అన్నది అసలు కథ.

సమీక్ష
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీగా చెప్పొచ్చు. డైరెక్టర్ గౌతమ్ ఇందులో చాలా ఎమోషన్స్ ని క్యారీ చేయగలిగాడు. వయసు దాటిపోతున్న టైంలో సక్సెస్ కోసం ప్రయత్నించే క్రమం అద్భుతంగా ఉంది. అటు క్రికెట్, ఇటు ఫ్యామిలీ రిలేషన్స్ ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ఫెయిల్ అయిన తన గతం, ఫెయిల్ అయిన తన జీవితం ఎలా వెళ్లిందనే విషయాన్ని అర్జున్ క్యారెక్టర్లో బాగా చూపించాడు. చాలా సందర్భాల్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. ఫాదర్ , సన్ రిలేషన్ ను అద్భుతంగా చూపించాడు. తన కొడుకు ముందు ఓడిపోకూడదనే తండ్రి పాత్రలో నాని ఇరగదీశాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చూపించాడు నాని. కొడుకు కోసం గెలిచేందుకు తాను చేసే ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. రెండున్నర గంటల పాటు మనల్ని భావోద్వేగాల నావలో తీసుకెళ్తాడు. క్రికెట్‌ అనే ఆటకు, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ జోడించి తెరకెక్కించిన చిత్రమిది.

దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి రాసుకున్న కథ, కథనం అద్భుతంగా ఉంటుంది. ఎంచుకున్న స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఈ తరహా కథ, కథనం మనకు అరుదుగా వస్తుంటాయి. అందులో నాని, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి హీరో హీరోయిన్స్ పెర్ ఫార్మెన్స్ బాగా కుదరడంతో పరిపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ హైలైట్ గా చెప్పొచ్చు. కొడుకు కోరిన జెర్సీ చేరే తీరు అద్భుతం. డైరెక్టర్ గా ఈ సీన్ చాలేమో అనిపిస్తుంది. ఓ క్రీడాకారుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో మనసుకు హత్తుకునేలా చూపించాడు. ఓ తండ్రి పడే ఆవేదన, ప్రయత్నాన్ని చాలా బాగా చూపించాడు. హీరోయిన శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్ పాత్రలు నిలిచిపోతాయి. లవర్ గా, భార్యగా శ్రద్ధా పాత్రను నిలబెట్టింది. కోచ్ గా సత్యరాజ్ పాత్ర హుందాగా ఉంది. కొడుకుగా నాని పాత్రలో నటించిన కుర్రాడు వంద శాతం న్యాయం చేశాడు.
ఓడిపోయిన వ్యక్తి గెలిస్తే, ఎలా ఉంటుందో ఈ కథ కూడా అలానే ఉంటుంది. అయితే, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌, పతాక సన్నివేశాలు ఇందులో అదనంగా కనిపిస్తాయి. క్లైమాక్స్‌ కంటతడి పెట్టిస్తుంది. ఆ ముగింపు చూసిన తర్వాత గుండె బరువెక్కిన ఫీలింగ్‌ కలుగుతుంది. దీనికి తగ్గట్టుగా అనిరుథ్ పాటలు రీ రికార్డింగ్, వర్గీస్ కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయి.

ఓవరాల్ గా…
ఈ తరహా కథ, కథనం మన తెలుగులో రాలేదనే చెప్పాలి. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా… సో గో అండ్ వాచిట్.

Rating : 3.75/5