ప్రతీ మెసేజ్ లవ్ లెటర్ లా ఉంది – జెర్సీ థాంక్స్ మీట్ లో నాని

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి వచ్చినంత అప్లాజ్ ఈ మధ్యకాలంలో మరే సినిమాకు కూడా రాలేదు. నానికి ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. శ్రద్ధా శ్రీనాథ్‌ ఇందులో కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పించారు. గౌతమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాలప్రేక్షకులని ఆకట్టుకోవడంతో… హైదరాబాద్ లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. యువ కథానాయకుడు రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమాకు పనిచేసిన వారిని ఈ సందర్భంగా క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా

నాని మాట్లాడుతూ….. మంచి సినిమా చేశారని అంతా మాకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రతి సందేశం ఓ ప్రేమలేఖలా ఉంది.. ఈ సినిమా విడుదల తర్వాత నాకు వచ్చినన్ని సందేశాలు, ఎక్కడికి వెళ్లినా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్న విధానం ఇదివరకెప్పుడూ అనుభవంలోకి రాలేదు. మామూలుగా ఒక సినిమా విడుదల తర్వాత వారానికి ప్రశంసలు, సందేశాలు రావడం తగ్గిపోతాయి. కానీ ‘జెర్సీ’కి మాత్రం ఏ రోజుకారోజు మెచ్చుకునేవాళ్లు పెరుగుతూనే ఉన్నారు. భావోద్వేగంతో కూడిన సినిమా కదా మళ్లీ మళ్లీ చూస్తారా అనుకొన్నాం. కానీ ప్రేక్షకులు సినిమాని చూసి ప్రతి సన్నివేశం గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. రానా సినిమా చూసి నాకు ఫోన్‌ చేశాడు. అప్పుడు తను మాట్లాడిన విధానం నాకు బాగా గుర్తుంది. దాదాపుగా ఏడుస్తున్నట్టుగా మాట్లాడాడు. చూసిన వెంటనే కలిసి నాతో గంట సేపు మాట్లాడాడు. తనకి అంత బాగా నచ్చింది. ‘జెర్సీ’ ఎప్పటికీ చాలా ప్రత్యేకంగా ఉండిపోతుంది. గతంలో చెప్పినట్టుగా మేమంతా పాతబడిపోవచ్చు కానీ ‘జెర్సీ’ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. గర్వపడే సినిమాగా మిగిలిపోతుంది. మేమెంత కష్టపడినా దాన్ని మించిన గౌరవం, ప్రేమ చూపించిన అందరికీ నా కృతజ్ఞతలు. అని అన్నారు.

రానా మాట్లాడుతూ…. నాకు జీవితంలో చాలా విషయాలు అర్థం కావు. క్రికెట్‌, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు… ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూశాక ఏడుపొచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమైయ్యుంటుందో అర్థం చేసుకోవచ్చు. నానిని వారంలో మూడుసార్లు కలుస్తాను. కానీ తనని చూసిన ప్రతిసారీ నాలో స్ఫూర్తిని నింపుతుంటాడు. సినిమాపై తనకున్న ప్రేమని చూసి కొత్తగా చేయాలనే తపన నాలో పెరుగుతుంటుంది. గౌతమ్‌ తిన్ననూరి ఒక కథకుడిగా, దర్శకుడిగా తన పని తీరు అందరి హృదయాలకి చేరువైంది. ‘యు టర్న్‌’ చూసినప్పట్నుంచి శ్రద్ధకి నేను అభిమానిగా మారిపోయా. సినిమా అనేది శాశ్వతం, ‘జెర్సీ’ ఈ చిత్ర బృందానికి ఒక మెరిట్‌గా నిలుస్తుంది. అని అన్నారు.

శ్రద్ధాశ్రీనాథ్‌ మాట్లాడుతూ… ఇందులో సారా పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం. తల్లిదండ్రులకి స్ఫూర్తినిచ్చే ఈ పాత్రని చేయడం, అది ప్రేక్షకులకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అని అన్నారు.
గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ… మా సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులు, మీడియా నుంచి మంచి స్పందన లభించింది. ఆ విషయంలో సంతోషంగా ఉంది. ఈ సినిమా చేసే అవకాశమిచ్చిన నిర్మాతలకి కృతజ్ఞతలు. మా డైరెక్షన్‌ టీమ్‌ నా బలం. నా తొలి సినిమా నుంచి వాళ్లు నాతో కలిసి ఉన్నార’’న్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణకాంత్‌, నవీన్‌ నూలి, మాస్టర్‌ రోనిత్‌, విశ్వంత్‌, నవీన్‌, కొమురం, కమల్‌, కృష్ణ, సురేష్‌, అనిల్‌- భాను, నీరజ కోన, విజయ్‌, అవినాష్‌ కొల్లా తదితరులు పాల్గొన్నారు.