రివ్యూ: జ‌్యోతిల‌క్ష్మి

టెంప‌ర్ లాంటి హిట్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం జ్యోతిల‌క్ష్మి. దాంతో సినిమాపై అంచ‌నాలు బాగానే పెరిగిపోయాయి. మ‌రి ఆ అంచ‌నాలను జ్యోతిల‌క్ష్మి ఏ మేర‌కు అందుకుంది..?

క‌థ‌:
జ్యోతిల‌క్ష్మి(ఛార్మి) ఓ వేశ్య‌. ఆమెను తొలిచూపులోనే ఇష్ట‌ప‌డ‌తాడు స‌త్య‌(స‌త్య‌దేవ్). ఆమెను ప్రేమిస్తున్నానంటూ రోజూ ఆమె ప్రాస్టిట్యూట్ హౌజ్ కు వెళ్తాడు. ఓ రోజు జ్యోతిల‌క్ష్మిని వేశ్యాగృహం నుంచి త‌ప్పించి.. త‌న ఇంటికి తీసుకెళ్తాడు. పెళ్లి చేసుకుంటాడు. సెక్స్ రాకేట్ ముఠాను న‌డిపే విల‌న్ గ్యాంగ్ తో అప్ప‌ట్నుంచీ ఇటు జ్యోతిల‌క్ష్మికి.. అటు ఆమె భ‌ర్త‌కు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అలాంటి ప‌రిస్థితుల నుంచి జ్యోతిల‌క్ష్మి ఎలా బ‌య‌ట‌ప‌డింది..? ఆమెతో పాటు ఇరుక్కున్న అమ్మాయిలంద‌ర్నీ ఎలా రక్షించింది..? అనేది మిగిలిన క‌థ‌.

క‌థ‌నం:
జ్యోతిల‌క్ష్మి మ‌ల్లాది వెంక‌ట్ గారు రాసిన మిసెస్ ప‌రంకూశం అనే న‌వ‌లా ఆధారంగా తెర‌కెక్కింది. అయితే సినిమాలో ఆ న‌వ‌ల మెయిన్ పాయింట్ ను మాత్ర‌మే తీసుకున్న పూరీ.. మిగిలిన క‌థంతా తనే అల్లుకున్నాడు. క‌థ‌నంలో జ్యోతిల‌క్ష్మి చాలా నెమ్మ‌దించింది. ఫ‌స్టాఫ్ అయితే మ‌రీ దారుణం. కొన్ని స‌న్నివేశాలైతే విసుగొచ్చేస్తాయి. ముఖ్యంగా హీరో వేశ్యాగృహంలోకి వ‌చ్చిన‌పుడు వ‌చ్చే స‌న్నివేశాలు.. ఛార్మి పెళ్లి త‌ర్వాత వ‌చ్చే శోభ‌నం సాంగ్.. ఆ త‌ర్వాత తాళి తెంచేసే సీన్ లాంటివైతే మ‌రీ చూడ‌లేని విధంగా ఉంటాయి. మొత్తానికి ఫ‌స్టాఫ్ ను అలా అలా కొన్ని కామెడీసీన్స్, మ‌రిన్ని విల‌న్ గ్యాంగ్ స‌న్నివేశాల‌తో చుట్టేసారు.
అస‌లు క‌థ మొద‌ల‌య్యేదే సెకండాఫ్ లో. అయితే అప్ప‌టికే సినిమాపై ప్రేక్ష‌కుల‌కు బ్యాడ్ ఇంప్రెష‌న్ ప‌డిపోతుంది. తొలి గంట బాగా విసిగించ‌డంతో సెకండాఫ్ లో అస‌లు క‌థ మొద‌ల‌య్యాక కూడా బోర్ ఫీలింగే వ‌చ్చేస్తుంది. ఛార్మి, స‌త్య మ‌ధ్య వ‌చ్చే సెంటిమెంట్ స‌న్నివేశాలు, ఆమె పోలీసుల‌తో చేసే వాగ్వాదం..లాంటి స‌న్నివేశాలు ప‌ర్లేద‌నిపిస్తాయి. ఇక చివ‌ర్లో కూడా బ్ర‌హ్మానందం, సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళ‌తో కామెడీ చేయించాల‌ని చూసాడు పూరీ. కానీ అది కూడా పూర్తిగా వ‌ర్క‌వుట్ కాలేదు.

న‌టీన‌టులు:
జ్యోతిల‌క్ష్మికి ప్ర‌ధాన‌మైన‌స్ ఛార్మి. అస‌లు ఇలాంటి పాత్ర‌లో ఆమెను స‌రిపోలేదు. ప‌దేళ్ళుగా కెరీర్ సాగిస్తున్నా.. ఇప్ప‌టికీ బ్రేక్ కోసం చూస్తున్న ఛార్మి ఇందులోనూ త‌న పాత్ర‌కు న్యాయం చేయ‌లేక‌పోయింది. కొన్ని స‌న్నివేశాల్లో మిన‌హా.. ఛార్మికి ఈ సినిమా పెద్ద‌గా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. వేశ్య పాత్ర‌లో గ‌తంలో అనుష్క లాంటి వాళ్లు చేసి మెప్పించారు గానీ ఛార్మి వ‌ల్ల అది సాధ్యం కాలేదు. కొన్ని సీన్స్ లో మ‌రీ జుగుత్స క‌లిగించే విధంగా ఛార్మి న‌ట‌న ఉంది. ఇక స‌త్య‌దేవ్ కొత్త‌వాడే అయినా త‌న పాత్ర వ‌ర‌కు ప‌ర్లేద‌నిపించాడు. త‌న ఫ్రెండ్ పాత్ర కూడా కామెడీకి బాగానే వ‌ర్క‌వుట్ అయింది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ్ర‌హ్మానందంతో కామెడీ చేయించాల‌ని చూసినా.. అది పెద్ద‌గా పేల‌లేదు. మిగిలిన కారెక్ట‌ర్స్ అన్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్ళిపోయేవే.

టెక్నిక‌ల్ టీం:
జ్యోతిల‌క్ష్మికి ఏదీ క‌లిసిరాలేదు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఒక‌టి రెండు పాట‌లు మిన‌హా పెద్ద‌గా ఆక‌ట్టుకునే సంగీతం ఇందులో లేదు. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. సినిమా చాలాచోట్ల బోర్ కొట్టేసింది. లెంతీగా ఉండ‌టం కూడా జ్యోతిల‌క్ష్మికి డ్రా బ్యాకే. ఇక చివ‌ర‌గా చెప్పుకోవాల్సింది పూరీ జ‌గ‌న్నాథ్ గురించి. పూరీ స్థాయి ద‌ర్శ‌కుడు నుంచి ఓ న‌వ‌లా ఆధార‌మైన సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు ఎంతో ఆశిస్తారు. కానీ అవి జ్యోతిల‌క్ష్మిలో క‌నిపించ‌వు. అయితే ద‌ర్శ‌కుడిగా కంటే..ఈ సినిమాకు రైట‌ర్ గా పూర్తిస్థాయి న్యాయం చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. కొన్నిచోట్ల త‌న‌కే సాధ్య‌మైన డైలాగులు రాసాడు. ముఖ్యంగా ఇద్ద‌రు కొట్టుకుంటే యుద్ధం.. ఒక‌రు మీద‌డిపోతే పెళ్లాం అంటూ పూరీ రాసిన సెటైరిక‌ల్ డైలాగ్స్ బాగానే పేలాయి. కానీ సినిమాలో చెప్పాల్సిన సందేశం ప‌క్క‌దారి ప‌ట్టి.. సైడ్ ట్రాక్ లో ఉన్నవ‌న్నీ మెయిన్ ట్రాక్ లో క‌నిపించాయి. జ్యోతిల‌క్ష్మి పూర్తిగా ఛార్మి కెరీర్ ను ఉద్ద‌రించ‌డానికి తీసిన‌ట్లుగా అనిపిస్తుంది.

చివ‌ర‌గా:
ఆడాళ్లంతా ఈ సినిమా చూసి గ‌ర్వ‌ప‌డ‌తారు.. కుటుంబాల‌తో వెళ్లి చూడ‌ద‌గ్గ సినిమా ఇది అంటూ ఛార్మి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. కానీ జ్యోతిల‌క్ష్మి సినిమాలో అంత మ్యాట‌ర్ క‌నిపించ‌దు. ఫ్యామిలీస్ ఈ సినిమా చూడ‌లేరు. ఫ‌స్టాఫ్ మ‌రీ హ‌ద్దు మీర‌డంతో జ్యోతిల‌క్ష్మి గాడిత‌ప్పింది. పూరీని మ‌రీ అభిమానించే వాళ్ల‌కు మిన‌హాయిస్తే.. జ్యోతిల‌క్ష్మి మిగిలిన‌వాళ్ల‌కు రుచించ‌డం క‌ష్టం.