విడుద‌ల‌కు ముందే క‌బాలి లీక్..

అవును మీరు చూసింది నిజ‌మే. లీకేజ్ భూతానికి క‌బాలి కూడా బ‌లైంది. సెన్సార్ పూర్తైన వెంట‌నే కాపీని నెట్ లో పెట్టేసారు కొంద‌రు ప‌నికి మాలిన వాళ్లు. ఇండియ‌న్ సినిమాకు ఆల్రెడీ ఓ జ‌బ్బు ఉంది. అదే పైర‌సీ. సినిమా విడుద‌లైన తొలి రోజే నెట్ లో పైర‌సీ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దాన్ని ఆప‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు నానా తంటాలు ప‌డుతున్నా.. పైర‌సీ భూతం మాత్రం అలాగే ఉంది. దీనితోనే త‌ల బొప్పి క‌డుతుంటే ఇప్పుడు మ‌రోటి త‌యార‌యింది ఇండ‌స్ట్రీకి. అదే లీకేజ్ య‌వ్వారం. విడుద‌ల‌కు ముందే సినిమా నెట్ లో ద‌ర్శ‌న‌మిచ్చేస్తోంది. ఇప్ప‌టికే చాలా సినిమాలు ఇలా లీకేజీకి బ‌ల‌య్యాయి. ఇప్పుడు క‌బాలి బ‌లి. ఇప్ప‌టికే నిర్మాత క‌ళైపులి ఎస్ ధాను మ‌ద్రాస్ హై కోర్ట్ ను ఆశ్ర‌యించి.. నెట్ లో క‌బాలి సంబంధిత లింకుల‌ను తీయిస్తున్నారు. ఈ సినిమాపై 200 కోట్ల బిజినెస్ జ‌రిగింది.. ఇలా అర్ధాంత‌రంగా సినిమా నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేస‌రికి వ‌ణికిపోతున్నారు బ‌య్య‌ర్లు. జులై 22న సినిమా విడుద‌ల కానుంది. 

మూడేళ్ల కింద అత్తారింటికి దారేది సినిమా విడుద‌ల‌కు ముందే నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ త‌ర్వాత గ‌తేడాది బాహుబ‌లి విజువ‌ల్స్ కూడా ఇలాగే నెట్ లో లీక‌య్యాయి. ఈ రెండు సంద‌ర్భాల్లో వీడియో దొంగ‌త‌నం చేసింది ఆయా సినిమాల‌కు ప‌నిచేస్తున్న టీం కావ‌డ‌మే ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి పొర‌పాటే జ‌రిగింది. కానీ సినిమా మొత్తం విడుద‌ల‌కు ముందే రావ‌డం అనేది మాత్రం ఇప్పుడు చాలా భయాన్ని క‌లిగిస్తోంది.

ఇదేదో బ‌య‌టి వాళ్లు చేస్తోన్న ప‌ని కాదు.. సెన్సార్ నుంచే లీక్ అవుతుందంటున్నారు విశ్లేష‌కులు. ఇప్పుడు క‌బాలి మాత్ర‌మే కాదు.. స‌ల్మాన్ సుల్తాన్ సెన్సార్ కాపీ కూడా విడుద‌ల‌కు ముందు రోజే విడుద‌లైంది. ఇక గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ సినిమా విడుద‌ల‌కు ప‌ది రోజుల టైమ్ ఉండ‌గానే సెన్సార్ కాపీ నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇప్ప‌టికే అన్ని మొబైల్స్, సిస్ట‌మ్స్ లోకి ఎక్కేసింది గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ. దీనికితోడు ఉడ్తాపంజాబ్ సినిమా సెన్సార్ కాపీ కూడా ఇలాగే వ‌చ్చేసింది. హాలీవుడ్ సినిమాల విష‌యంలో సెన్సార్ మ‌రింత దారుణంగా ఉంటుంది. మొత్తానికి విడుద‌ల త‌ర్వాత పైర‌సీ సినిమాను చంపేస్తుంటే.. ఇప్పుడు విడుద‌ల‌కు ముందే లీకేజ్ మ‌రింత తొక్కేస్తుంది.