కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సందేశాత్మక చిత్రం – రామ్ గోపాల్ వర్మ

‘మామూలు క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఈ తరహా సినిమాలు ఎక్కువగా చేస్తున్నాను. తాజాగా రూపొందించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఓ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌’ అని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌, అజరు మైసూర్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్‌ తాతోలుతో కలిసి వర్మ దర్శకత్వం వహించారు. సెన్సార్‌ దశలో ఉన్న ఈ సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
నా కెరీర్‌లోనే తొలి సందేశాత్మక చిత్రమిది. వాస్తవిక పాత్రల అధారంగా ఫిక్షన్‌ కథాంశంతో తీసిన పొలిటికల్‌ సెటైర్‌ మూవీ. ఇలాంటి జోనర్‌ సినిమా ఇంతవరకూ ఇండియాలోనే రాలేదు.
వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఈ ఆలోచన తట్టింది. ఒక వర్గం వారు మరొక వర్గం వారి ప్రదేశానికి రావడం అనేది నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాను. ఒకరిని తక్కువ చేసి, మరొకరిని ఎక్కువ చేసి చూపించలేదు.
మే 2019 నుండి సెప్టెంబర్‌ 2020 మధ్య జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ఊహించి తీశాం. మాజీ ముఖ్యమంత్రిని పోలిన ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వ్యక్తిని ట్రాక్‌ చేసి నెల రోజులు ట్రైనింగ్‌ ఇచ్చి ఆ పాత్ర చేయించాం. ఆయన్ని ఆటోడ్రైవర్‌గా చూపించడమనేది జస్ట్‌ ఫాంటసీ ఎలిమెంట్‌. రాష్ట్రాన్ని ఆయన ఎంత బాగా నడిపిస్తున్నారు అనేది అలా సింబాలిక్‌గా చూపించాను.
ఇక తెలుగుదేశం పార్టీ వాళ్లకే ‘పప్పు’ సీన్‌ ఎక్కువగా నచ్చిందని విన్నాను. పవన్‌ కళ్యాణ్‌ని పోలిన పాత్ర మాత్రమే సినిమాలో ఉంది. మా సినిమాలోని మనసేనకి పవన్‌కళ్యాణ్‌కి ఎలాంటి సంబంధం లేదు. ప్రత్యేకంగా ఎవరినీ టార్గెట్‌ చేయలేదు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నవే చూపించాం. నా గత చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ని బాలకష్ణకి అంకితమిచ్చాను. అలాగే ఈ సినిమాను ఓ ఇద్దరు తండ్రికొడులకు అంకితమిస్తున్నాను.
ఈ తరహా సినిమాలు నాకు వత్తిపరంగా కంటే వ్యక్తిగతంగానే ఎక్కువ తప్తినిస్తాయి. ఎందుకంటే చిన్నప్పట్నుంచి నాకు గిల్లడమంటే ఇష్టం. ఓ ఫిల్మ్‌ మేకర్‌గా నేను ఫీల్‌ అయిన ఎగ్జైట్‌ మెంట్‌నే సినిమాగా చెప్పాలనుకుంటాను. నేను తీసే రియలిస్టిక్‌ డ్రామాలకు ఇమేజ్‌ ఉన్న హీరోలు సరిపడరు. అందుకే కొత్తవాళ్లతో చేస్తున్నాను. నా సినిమాలపై కోర్టుకు వెళ్లడం అనేది సూర్యుడు తూర్పున ఉదయించడమంత కామన్‌. అలాంటివి పెద్దగా పట్టించుకోను. కె.ఎ.పాల్‌ లాంటి వ్యక్తులను కూడా పట్టించుకోవడం మానేశాను. ‘బ్యూటిఫుల్‌’ సినిమా వచ్చే నెలలో విడుదల చేయనున్నాం. ఇండో- చైనీస్‌ కో ప్రొడక్షన్‌గా తీసిన ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ చిత్రం కూడా విడుదల సన్నాహాల్లో ఉంది.