ఇద్ద‌రు చంద్రుళ్లూ తార‌స ప‌డే ఛాన్సే లేదా!

ఒక‌రు కేంద్రంలో చ‌క్రం తిప్పుదామ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహం ప‌న్నే నేత‌. ఒక‌రు బంగారు తెలంగాణ సాధ‌న వ‌ర‌కే త‌న స్వ‌ప్నాల‌ను ప‌రిమితం చేస్తోన్న నేత‌. ఒక‌రిది ఆరాటం. ఇంకొక‌రిది పోరాటం. ఒక‌ర‌ది కేవ‌లం స్వ‌ప్నం మాత్ర‌మే!.. మ‌రొక‌రిది అనుకున్న‌ది సాధించేయాల‌న్న పంతం. వారే తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్ర‌బాబు అండ్ కేసీఆర్‌. విభ‌జ‌న పూర్త‌య్యాక అనేకానేక స‌మ‌స్య‌ల విష‌యంలో ఇరు ప్రాంతాల మ‌ధ్య ఎడ‌తెగ‌ని పంచాయితీ న‌డుస్తోంది. కొన్ని సంద‌ర్భాల్లో ఇరు సీఎంలు క‌లుసుకునేందుకు కూడా విముఖ‌త చూపుతున్నారు. మొన్న‌టికి మొన్న వ‌ర్షాకాల విడిది నిమిత్తం హైద్రాబాద్‌కు వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తి ని ఆహ్వానించేందుకు ఇరువురు సీఎంలూ వ‌స్తార‌ని అంతా భావించారు కానీ అలా జ‌ర‌గ‌లేదు. త‌రువాత గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకూ గైర్ఞాజ‌ర‌య్యారు. ఇప్పుడు నీతి అయోగ్ మీటింగ్‌లో వీరిరువురూ క‌లుస్తార‌ని అంతా భావించినా పుష్క‌రాల నేప‌థ్యంలో వీరిరువురూ రాలేక‌పోతున్నామ‌ని పీఎంఓకు మెసేజ్ సెండ్ చేశారు. ఇలా ప‌రిస్థితుల రీత్యా కొన్నిసార్లు.. వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా మ‌రికొన్నిసార్లు ఇరువురు చంద్రుళ్లూ ప‌ర‌స్ప‌రం తార‌స‌ప‌డ‌లేక‌పోతున్నారు.

ఎప్ప‌టికప్పుడు స‌మ‌స్య‌ల విష‌యంలో చ‌ర్చించుకుందామ‌ని ఏసీ సీఎం చంద్ర‌బాబు హిత‌వ‌చ‌నాలైతే చెబుతున్నారు కానీ ఆచ‌ర‌ణ మాత్రం అందుకు భిన్నంగా ఉంద‌ని గులాబీ ద‌ళం వాద‌న‌. కేసీఆర్ మాత్రం త‌గువులూ..తంటాలూ తీరెలా ఉన్నా తాను అనుకున్న కార్య‌క్ర‌మాల‌న్నింటీనీ టంఛ‌నుగా చేసుకుపోతున్నారు. అభివృద్ధి విష‌యంలో ఆయ‌న‌తో పోటీ ప‌డ‌లేక బాబు చ‌తికిల‌ప‌డుతున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల మధ్య జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో వీరివురి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చే బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌కు ఉంది. కానీ గ‌వ‌ర్న‌ర్ మాత్రం ప‌ద‌విని ప‌దిలం చేసుకునేందుకే య‌త్నిస్తున్నార‌న్న‌ది ఓ విమ‌ర్శ‌.