ఫిలింసిటీలో కబ్జా భూముల్లేవ్… రామోజీకి కేసీఆర్ క్లీన్ సర్టిఫికేట్

ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఫిలింసిటీలో ఒక్క అంగుళం కూడా కబ్జా భూమి కాని, ఆక్రమించుకున్న భూమి కానీ లేదన్నారు. ఆదివారం కేసీఆర్ వరంగల్‌లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఫిలింసిటీ రామోజీ కష్టార్జితంతో కట్టుకున్నదన్నారు. అక్కడ ప్రతి అంగుళం ఆయన సొంతంగా కష్టపడ్డ సొముతో కొనుక్కున్నదేనని కేసీఆర్ తెలిపారు.
రామోజీరావు ఫిలింసిటీ నిర్మించే ఓం ఆధ్యాత్మిక కేంద్రం దేశానికే తలమానికంగా నిలుస్తుందని కూడా ప్రశంసించారు. అది పూర్తయితే రోజుకు లక్షమంది దాన్ని సందర్శిస్తారని… హైదరాబాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుందని తెలిపారు. మీరు అధికారంలోకి వస్తే ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నుతానన్నారని ఓ విలేకరి ప్రశ్నిస్తే నీ బుర్ర ఖరాబైనట్టు ఉంది.. ఆ మాట తాననలేదని అది కేవలం మీడియా వాళ్ల కల్పన అని కొట్టి పారేశారు. ఏదేమైనా రామోజీపై కేసీఆర్ ప్రశంసలు రాజకీయవర్గాల్లో కాస్త హాట్ టాపిక్ అయ్యాయి.