కేసీఆర్ మహిమ.. కోహ్లి కిస్‌లు.. భారత్ విజయం

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సీరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 48.2 ఓవర్లలో 242 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఉమేష్‌యాదవ్ 4 వికెట్లు తీశాడు. 


అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 44.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించి సీరీస్ కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్‌ధావన్ 91 పరుగులు సాధించి తృటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. విరాట్‌కోహ్లీ 53 పరుగులు, అంబటిరాయుడు 35 పరుగులు సాధించారు. 

కేసీఆర్ గోల్డెన్ లెగ్ మహిమేనా..
ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో భారత్ ట్రాక్ రికార్డు సరిగా లేదు. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లాడితే భారత్ చివరి సారిగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్‌కు తెలంగాణ సీఎం హోదాలో హాజరైన కేసీఆర్ తెలంగాణ ఆటగాడు అంబటి రాయుడు చేతిని ఆప్యాయంగా ముద్దాడారు. కెప్టెన్ కోహ్లి ఆటగాళ్లను కేసీఆర్‌కు పరిచయం చేశారు. అనంతరం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. భారత్ విజయానికి ఆయన లెగ్ మహిమే కారణమన్న సరదా వ్యాఖ్యలు తెలంగాణలో వినిపిస్తున్నాయి.

కోహ్లి గర్ల్‌ఫ్రెండ్‌కు కిస్‌లు..
కెప్టెన్ విరాట్ కోహ్లి గర్ల్‌ఫ్రెండ్ అనుష్కశర్మ భారత్ ఇన్సింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి స్టేడియానికి చేరుకుంది. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు వీలు కుదిరితే అనుష్కవైపు చూస్తూనే ఉన్నాడు. అర్థసెంచరీ పూర్తికాగానే బ్యాట్‌తో అనుష్కకు కిస్ ఇచ్చాడు. దీంతో ఆమె కూడా ముసిముసినవ్వులతో కోహ్లివైపు చూసింది. ఈ మ్యాచ్‌లో ఈ జంట స్టార్ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.