కేసీఆర్ కు ఏమైంది.. పదే పదే ఎందుకలా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల సభల్లో విచిత్రం ప్రవర్తిస్తున్నారు. హుషారుగా ప్రసంగం మొదలుపెడుతూనే ఉన్నట్టుండి వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ప్రసంగించిన సీఎం…తానున్నా లేకున్నా బంగారు తెలంగాణ కోసం అందరూ కష్టపడాలంటూ  పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చాలామందికి సాధారణంగానే అనిపించినా ..ఇటీవల కేసీఆర్ ప్రసంగాలను ఫాలో అవుతున్నవారికి మాత్రం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుక్కారణం ఇటీవల ఆయన కాస్త నైరాశ్యంగా, వేదాంత ధోరణిలో మాట్లాడటం.

ఇటీవల బసవేశ్వర  జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్… అక్కడ కూడా అదో ధోరణిలో మాట్లాడారు. త్వరలోనే బసవేశ్వర్ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఆయన…జోష్ గా మాట్లాడుతూనే.. సడెన్ గా భగవంతుడు తనకు అవకాశం ఇస్తే.. బసవేశ్వరుడి దయ తనపై ఉంటే.. కచ్చితంగా బసవ భవన్‌కు ఫౌండేషన్‌ తానేవేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఉన్నట్టుండి కేసీఆర్ అలా విచిత్రంగా మాట్లాడటంతో  అక్కడ కాసేపు ఉద్వేగం నెలకొంది.

ఇదే కాకుండా అంతకు రెండు రోజుల ముందు మాదాపూర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో జరిగిన సాంస్కృతిక సారథి కార్యక్రమంలోకే కేసీఆర్‌ అలానే  మాట్లాడారు. ఇన్నాళ్లు తెలంగాణ తప్ప తనకే కోరికలు లేవని.. అది కూడా తీరిపోయింది కాబట్టి .. ఇకపై తానున్నా.. లేకపోయినా.. తెలంగాణలో ఉండేవారు మీరేనన్నారు.. దీంతో అక్కడ కొద్దిసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ సలహాదారు రమణాచారి జోక్యం చేసుకుని అలా మాట్లాడొద్దని  కోరినా.. అలానే మాటలని కొనసాగించారు..ఇలా పదే పదే కేసీఆర్ అదోలా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది..
 
ఇంతకి కేసీఆర్ ఏమైంది.. ఎందుకు పదే పదే వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారన్నది ఎవరికి అంతుబట్టడం లేదు..