మూతులకు గుడ్డలు కట్టినా కేసీఆర్ తగ్గడ్రా బై

తానుపట్టిన కుందేలుకు మూడుకాళ్లు.. నేనెవ్వరి మాట వినను.. ఒక్క మాటలో చెప్పాలంటే సీతయ్యను….. అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తాజాగా తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనేం పట్టించుకోవడం లేదు. నాకేమ్ సంబంధం రా బై…అని చెప్పిండ్రు. ఎంఎస్ వో లను అడుక్కోండని చెప్పిండు.

తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడ ఛానెళ్లకు చెందిన జర్నలిస్టులు ఆయన ఇంటిముందు నిరసన వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. అక్కడ న్యూస్ ప్రజెంటర్లు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని తమ నిరసన తెలిపారు. అయితే ఆయన వారి గోల పట్టించుకునేది ఏంది అన్నట్టుగా ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్లిపోయారు. పైగా నిరసన తెలుపుతున్న వారి వద్దకు తెలంగాణ ఎంపీలు వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డి వచ్చి ఛానెళ్ల నిలిపివేతకు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. అది ఎంఎస్‌వోలు తీసుకున్న నిర్ణయమని సింపుల్‌గా తేల్చేశారు. దీంతో అవాక్కవ్వడం అక్కడున్న విలేకర్ల వంతు అయ్యింది. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా తమ నిరసన ప్రదర్శన కొనసాగుతుందని వారు చెపుతున్నారు. అయితే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా దీనిపై చర్చ జరిగినా…తనకు ఆ ఇష్యూతో సంబంధం లేదని తేల్చేశారు.  

టీవీ-9లో మాత్రం తాము తెలంగాణ ప్రజాప్రతినిధులపై వేసిన కథనానికి పొరపాటుగా క్షమాపణ కూడా చెప్పారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని తన రాతలు, కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. అయితే ఏతా వాతా అర్థమవుతున్నదేంటంటే టీవీ-9 ఎలాగు క్షమాపణ చెప్పినందున ఇక మిగిలింది రాధాకృష్ణే. ఎన్నికలకు ముందు అవకాశం చిక్కినప్పుడల్లా తెరాసతో పాటు కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై కథనాలు వండివార్చిన ఏబీఎన్‌పైనే ఇప్పుడు కేసీఆర్ దృష్టి సారించినట్టు క్లీయర్‌గా అర్థమవుతోంది. అయితే ఏదేమైనా కేసీఆర్ మాత్రం ఈ విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా, పార్లమెంటులో చర్చలు జరిగినా వెనక్కితగ్గడం లేదు. తాజా పర్యటనలో ఆయన ఆయన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖా మంత్రి ప్రకాష్‌జవదేవకర్‌ను కూడా కలిశారు. అక్కడ కూడా అది ఎంఎస్‌వోలు తీసుకున్న నిర్ణయమని తాను ఏం చేయలేనని ఖరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టే మీడియాను ఆయన తన దారిలోకి తెచ్చుకునేందుకు ఎందాకైనా వెళతానని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టు అర్థమవుతోంది. మరి ఈపోరు ఎన్ని రోజులు కొనసాగి ఎలా సుఖాంతమవుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.