కేరింత‌ రివ్యూ

హ్యాపీడేస్ త‌ర్వాత ఆ స్థాయిలో మ‌ళ్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన సినిమా మ‌రోటి లేదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో స్నేహ‌గీతం లాంటి సినిమాలు వ‌చ్చినా.. అవి హ్యాపీడేస్ స్థాయిలో అల‌రించ‌లేక‌పోయాయి. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ట్రైల‌ర్స్, సాంగ్స్ తో అలాంటి ఫ్రెష్ ఫీల్ తెచ్చింది కేరింత. మ‌రి పైపై హంగులేనా.. లోప‌ల కూడా ఈ కేరింత‌లో కేరింత పెట్టించేంత మ్యాట‌ర్ ఉందా..?

క‌థ‌:
జై(సుమంత్ అశ్విన్)కు ఓ ఎంసీఏ స్టూడెంట్. లైఫ్ లో ఎప్ప‌టికైనా ఫోటోగ్ర‌ఫ‌ర్ గా నిల‌వాల‌నేది అత‌డి క‌ల‌. ఇక సిద్దుకు మ్యూజిషియ‌న్ అవ్వాల‌నేది డ్రీమ్. భావ‌న హైయ్య‌ర్ స్ట‌డీస్ చ‌దివి లైఫ్ లో గొప్ప పొజిష‌న్ లో ఉండాల‌ని ల‌క్ష్యం. నూక‌రాజు శ్రీకాకుళం నుంచి వ‌చ్చేసి ఇక్క‌డ సిటీ అమ్మాయిల‌ని ప‌డేయాల‌ని తాప‌త్ర‌యం. ఓ రోజు అనుకోకుండా బ‌స్ లో మ‌న‌స్విని(శ్రీదివ్య‌) ని చూసి ల‌వ్ లో ప‌డ‌తాడు హీరో జై. మ‌రోవైపు సిద్దు కూడా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక నూక‌రాజు కూడా ల‌వ్ లో ప‌డ‌తాడు. వీళ్లంతా త‌మ‌ ప్రేమ‌ను ఎలా సాధించుకున్నారు. చివ‌రికి వాళ్ల ల‌క్ష్యాల్ని ఎలా చేరుకున్నారనేది కేరింత క‌థ‌.

క‌థ‌నం:
అంద‌మైన కాలేజ్.. ఐదుగురు స్నేహితులు.. ఏ దాప‌రికాల్లేకుండా సాగిపోయే వాళ్ల స్నేహం.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో చిన్ని చిన్ని త‌గాదాలు.. అంద‌మైన ప్రేమ‌లు.. ఇదే సింపుల్ గా చెప్పాలంటే కేరింత క‌థ‌. ఇందులో కొత్త‌గా చెప్ప‌డానికి ఏమీలేదు. కానీ క‌థ‌నంలోనే కొత్త‌ద‌నాన్ని చూపించాడు ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ అడ‌వి. తెలిసిన క‌థ‌నే మ‌రింత అందంగా చెప్పాడు. ఫ‌స్టాఫ్ అయితే ర‌య్ మని బ్రేకుల్లేని బండిలా దూసుకుపోయింది. ముఖ్యంగా శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడే కారెక్ట‌ర్ ను అయితే సినిమాలో వీలైనంత వ‌ర‌కు వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. కేరింత బోర్ కొట్ట‌కుండా ఉందంటే కార‌ణం ఆ శ్రీకాకుళం పాత్ర‌దే కీల‌కం. ప్ర‌తీచోట హ్యాపీడేస్ గుర్తుకు వ‌స్తున్నా.. ఫ్రెష్ సీన్స్ తో వీలైనంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల దృష్టి హ్యాపీడేస్ పైకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. సెకండాఫ్ లో మాత్రం క‌చ్చితంగా ఎమోష‌న్స్, సెంటిమెంట్స్ ఉండాలి కాబ‌ట్టి అక్క‌డ కాస్త లాగించిన‌ట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దు తన ప్రేమ గురించి త‌ల్లి ద‌గ్గ‌ర చెప్పే సీన్ బొమ్మ‌రిల్లు క్లైమాక్స్ ను గుర్తుకు తెస్తుంది. ఇక హీరో సుమంత్ అశ్విన్ పాత్ర 3 ఇడియ‌ట్స్ లో అమీర్ ఖాన్ పాత్ర‌ను జ్ఞ‌ప్తికి తెస్తుంది. కేరింత చూస్తున్నంత సేపూ ఓ వైపు హ్యాపీడేస్.. మ‌రోవైపు బొమ్మ‌రిల్లుతో పాటు మ‌రిన్ని సినిమాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. అయినా క్లైమాక్స్ కు చేరుకునే స‌రికి.. ఓ మాదిరి సంతృప్తితోనే థియేట‌ర్ బ‌య‌టికి వ‌చ్చేలా చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

న‌టీన‌టులు:
ఇంతకుముందు సినిమాల‌తోనే త‌న‌లో మంచి న‌టుడు ఉన్నాడ‌నే విష‌యం నిరూపించుకున్నాడు సుమంత్ అశ్విన్. ఇక ఇందులో కూడా త‌న ఏజ్ కు స‌రిపోయే పాత్ర‌లో బాగానే మెప్పించాడు సుమంత్. పైగా క్యూట్ లుక్స్ తో హ్యాండ్ స‌మ్ గా కూడా క‌నిపించాడు. ఇక శ్రీ‌దివ్య కనిపించేది కాసేపే అయినా.. త‌న పాత్ర వ‌ర‌కు న్యాయం చేసింది. తేజ‌స్విని కూడా అక్క‌డ‌క్క‌డా గ్లామ‌ర్ షో తో ఆక‌ట్టుకుంది. ఇక మిగిలిన వాళ్ళంతా కొత్త‌వాళ్లే. సిద్దు పాత్ర చేసిన కుర్రాడు ప‌ర్లేద‌నిపించాడు. భావ‌న పాత్ర క‌థ‌కు బాగా కీల‌కం. ముగ్గురు కొత్త‌వాళ్ళ‌లో అంద‌రికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడిన కుర్రాడే. ప‌ర్ ఫెక్ట్ స్లాంగ్ తో చాలాచోట్ల న‌వ్వించాడు. ఫ‌స్టాఫ్ ను ఒంటిచేత్తో లాక్కొచ్చేసాడు. ఇక మిగిలిన పాత్ర‌ల్లో అనితా చౌద‌రి, జీడిగుంట శ్రీ‌ధ‌ర్, స‌మీర్ ప‌ర్లేద‌నిపించారు.

టెక్నిక‌ల్ టీం:
కేరింత‌కు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్య‌క్తి మిక్కీ జే మేయ‌ర్. ఇలాంటి యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు సంగీతం అందించ‌డంలో ఆరితేరిపోయాడు మిక్కీ. ఈ సినిమాకు కూడా ప‌ర్ ఫెక్ట్ మ్యూజిక్ తో అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంది. చాలాచోట్ల ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచింది. ఇక సాహిత్యం కూడా బాగుంది. రామ‌జోగయ్య శాస్త్రి ఈ సినిమాకు పాట‌ల‌న్నీ రాసారు. మిక్కీ త‌ర్వాత సినిమాటోగ్ర‌ఫ‌ర్ విజ‌య్ కే చ‌క్ర‌వ‌ర్తి ప‌నిత‌న‌మే హైలైట్. అబ్బూరి ర‌వి మాట‌లు చాలాచోట్ల ఆక‌ట్టుకున్నాయి. శ్రీకాకుళం యాస‌లో వ‌చ్చే ప్ర‌తీ డైలాగ్ థియేట‌ర్ లో న‌వ్వులు పూయించింది.
లాస్ట్ బ‌ట్ నాట్ లీస్ట్.. చెప్పుకోవాల్సింది ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ అడ‌వి గురించి. ఇలాంటి క‌థ‌తో నిర్మాత‌ల్ని మెప్పించడ‌మంటే మాట‌లు కాదు. ఎందుకంటే ఇలాంటి క‌థ‌లు ఎక్క‌డో ఓ చోట విన్న‌ట్లే ఉంటాయి. మ‌న చుట్టుప‌క్క‌ల జ‌రుగుతున్న‌ట్లే ఉంటాయి. అయినా మ‌న జీవితాల‌కు క‌నెక్ట్ అవుతాయి. ఆ కొత్త‌ద‌నం త‌న క‌థ‌లో చూపించాడు సాయికిర‌ణ్. హ్యాపీడేస్ బెంచ్ మార్క్ సెట్ చేయ‌డంతో ఆ మాయ‌లో ఉన్నా.. త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో కేరింత‌ను నిల‌బెట్టాడు సాయికిర‌ణ్ అడ‌వి. అయితే సెకండ్ హాఫ్ ను బాగా డీల్ చేయ‌లేక‌పోవ‌డం.. సెంటిమెంట్ సీన్స్ సింపుల్ గా తేల్చేయ‌డం లాంటివి కాస్త నిరాశ క‌లిగిస్తాయి. ఇక దిల్ రాజు త‌ర‌ఫు నుంచి సినిమాకు కావాల్సిన‌వ‌న్నీ స‌మ‌కూరాయి. సినిమా చాలా గ్రాండ్ గా వ‌చ్చింది.

చివ‌ర‌గా:
కేరింత ఓ మంచి యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్. స్నేహం విలువ‌ను.. ప్రేమ గొప్ప‌త‌నాన్ని.. మ‌నం మర్చిపోయిన తీపి జ్ఞాప‌కాల్ని మ‌రోసారి త‌డిమే మంచి సినిమా. అయితే చాలాచోట్ల హ్యాపీడేస్ గుర్తుకు రావ‌డ‌మే దీనికి మైన‌స్. లోపాలు వెత‌క‌డం మానేసి.. బ్లాంక్ మైండ్ తో థియేట‌ర్స్ కి వెళ్తే కేరింత బాగానే కేరింత పెట్టిస్తుంది.