ఖైదీకి అన్నీ అలా క‌లిసొస్తున్నాయంతే..

ఖైదీ నెం.150కు అన్నీ అలా క‌లిసొస్తున్నాయి. ఈ టైటిల్ విన్న‌ప్ప‌ట్నుంచే మెగాభిమానులు ఫుల్ జోష్ లో క‌నిపిస్తున్నారు. ఇక సినిమా కూడా ఏ మాత్రం ఆల‌స్యంగా చేయ‌కుండా సంక్రాంతికే వ‌చ్చేస్తుంద‌ని నిర్మాత రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జ‌న‌వరి 13న సంక్రాంతి కానుక‌గా ఖైదీ రానున్న‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేసాడు చిరుత‌. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ పూర్తి కావ‌డ‌మే కాదు.. డ‌బ్బింగ్ కూడా మొద‌లుపెట్టాడు మెగాస్టార్.

దానికి తోడు ఖైదీతో చిరంజీవికి చాలా మంచి రిలేష‌న్ ఉంది. సెంటిమెంట్లు కూడా చిరంజీవికి బాగా క‌లిసొస్తున్నాయి. గ‌తంలో ఖైదీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మెగాస్టార్. ఆ త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 786తో మ‌రోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్ కొన‌సాగిస్తూ ఖైదీ నెం.150 చేస్తున్నాడు మెగాస్టార్. ఖైదీ నెం.150కి మ‌రో సెంటిమెంట్ కూడా క‌లిసొస్తుంది. అదే కాంబినేష‌న్. సరిగ్గా పుష్క‌రం కింద వ‌చ్చిన ఠాగూర్ సినిమాకు ఇదే టీం ప‌ని చేసింది. అప్పుడు కూడా మురుగ‌దాస్ క‌థ‌.. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం.. సురేఖ కో ప్రొడ్యూస‌ర్.. ప‌రుచూరిబ్ర‌ద‌ర్స్ మాట‌లు.. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ సారి సురేఖ నిర్మాత‌గా మారింది.. మురుగ‌దాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు.. చాలా రోజుల త‌ర్వాత పరుచూరి బ్ర‌ద‌ర్స్ మాట‌లు రాస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఇప్పుడు క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నాడు మెగాస్టార్.

ఇక ఖైదీ నెంబ‌ర్ 150ని ఊరిస్తోన్న మ‌రో సెంటిమెంట్ రీమేక్ తో రీ ఎంట్రీ. అప్ప‌ట్లో చిరంజీవి కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా భావించే హిట్ల‌ర్ సినిమా రీమేక్. అప్ప‌టికే రెండేళ్లుగా వ‌ర‌స ఫ్లాపుల‌తో ఉన్న చిరంజీవి కెరీర్ గాడిన ప‌డింది హిట్ల‌ర్ సినిమాతోనే. మ‌ళ‌యాలం నుంచి అరువు తెచ్చుకున్న క‌థ‌తో మ‌ళ్లీ గాడిన ప‌డ్డాడు చిరంజీవి. ఇప్పుడు తొమ్మిదేళ్ళ గ్యాప్ త‌ర్వాత హీరోగా న‌టిస్తోన్న సినిమాను త‌మిళ్ నుంచి తెచ్చుకున్నాడు మెగాస్టార్. మొత్తానికి ఇన్ని పాజిటివ్స్ మ‌ధ్య చిరంజీవి ఏం రేంజ్ లో రప్ఫాడిస్తాడో చూడాలి..!