కిరాక్ పార్టీ మూవీ రివ్యూ

నిఖిల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాడు. హ్యాపీడేస్ తర్వాత మళ్లీ కాలేజ్ సబ్జెక్ట్ ను తీసుకున్న చిత్రం కిరాక్ పార్టీ. కన్నడలో సూపర్ హిట్ అందుకున్న కిరిక్ పార్టీనే తెలుగులో కిరాక్ పార్టీగా శరణ్ దర్శకుడిగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ట్రైలర్స్ తో మంచి టాక్‌ అందుకున్న ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంది? టైటిల్‌కు తగ్గట్టే ‘కిరాక్‌’ పుట్టించిందా? చూద్దాం. 

 

కథేంటంటే: 

కృష్ణ(నిఖిల్)అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి కథ ఇది. నాలుగేళ్లలో కాలేజీ జీవితంలో ఎదురైన అనుభవాలు, అతని జీవితంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు, పరీక్షలు, కాలేజీలో ఎన్నికలు.. ఇవన్నీ కలిసిన ప్రయాణమే ‘కిరాక్‌ పార్టీ’. వీటన్నింటినీ దాటుకుని కృష్ణ ఇంజినీరింగ్‌ పట్టాతో బయటికి వెళ్లాడా? ఈ ప్రయాణంలో అతను ఏం నేర్చుకున్నాడు? తాను ప్రేమించిన అమ్మాయి ఏమయ్యింది. తనను ప్రేమించి న అమ్మాయి సంగతేంటి. తన ఫ్యూచర్ ను ఎలా ప్లాన్ చేస్కున్నాడన్నదిది తెరపై చూడాలి.

 

సమీక్ష

హ్యాపీ డేస్‌, త్రీ ఇడియట్స్‌, ప్రేమమ్‌ ఈ లక్షణాలన్నీ కథలో కన్పిస్తుంటాయి. వాటి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథలా అనిపిస్తుంది. దర్శకుడు దాదాపు కన్నడ మాతృకను ఫాలో అయిపోయాడు. తొలి సగం కాలేజీ సన్నివేశాలతో సరదాగా గడిచిపోతుంది. జూనియర్లు, సీనియర్ల మధ్య గొడవలు, ర్యాగింగ్‌కు ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన సన్నివేశాలు కాలేజీ కుర్రాళ్లకు బాగా నచ్చుతాయి. మీరా(సిమ్రన్‌) అనే పాత్ర ఎంట్రీతో కథలో ఎమోషనల్‌ టచ్‌ వస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే సన్నివేశాలన్నీ కాస్త భావోద్వేగంగా సాగుతాయి. కృష్ణ పాత్ర రెబెల్‌గా మారడానికి ఆయా సన్నివేశాలే కారణమవుతాయి. ద్వితీయార్థం మొత్తం నిఖిల్‌లోని హీరోయిజాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎక్కువై వినోదం ప్రాధాన్యత తగ్గింది. పతాక సన్నివేశాలకు ముందు కథ మళ్లీ గాడీలోకి వస్తుంది. కృష్ణ తన లక్ష్యం తెలుసుకుంటాడు. క్లైమాక్స్ హ్యాపీడేస్‌ను తలపిస్తుంది. స్నేహితులంతా ఒక్కటైపోవడం, వాళ్ల మధ్య గొడవల్ని పక్కన పెట్టడం ఇవన్నీ ఎమోషనల్‌గా టచ్‌ చేసేవే. మొత్తానికి దర్శకుడు ఒక కథను కాలేజీ కుర్రాళ్లకు నచ్చేలా తెరకెక్కించగలిగారు.

 

నిఖిల్‌ పాత్ర రెండు షేడ్స్‌లో సాగుతుంది. తొలి సగం చాకొలెట్‌ బాయ్‌లా కనిపిస్తే ద్వితీయార్థం మాస్‌ లుక్‌తో కన్పిస్తారు. రెండు షేడ్స్‌ చాలా బాగా పండించారు. మీరా దూరమయ్యే సన్నివేశంలో అతని నటన ఆకట్టుకుంటుంది. కథానాయికలు ఇద్దరివీ మంచి పాత్రలే. రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలకు భిన్నంగా సాగాయి. సంయుక్త హెగ్డే, సిమ్రన్‌ వారి పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. స్నేహితుల బ్యాచ్‌లో దాదాపు అందరూ కొత్తవారే. అయినా వారి పాత్రలను సమర్థవంతంగా పోషించారు. సాంకేతికంగా చూస్తే కథలో వైవిధ్యమేమీ లేదు. కొన్ని సన్నివేశాలను అల్లిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. ద్వితీయార్థం నెమ్మదించింది. నిడివి కూడా ఎక్కువే. అక్కడ కూడా వినోదం ఉండేలా చూసుకుంటే బాగుండేది. కెమెరా, సంభాషణలు, స్క్రీన్‌ప్లే ఇలా ఏ రకంగా చూసుకున్నాకొత్తదనం లోపించినట్లు కనిపించింది.

PB Rating : 3/5