క‌మెడియ‌న్ కొండ‌వ‌లస క‌న్నుమూత‌..

తెలుగు సినిమాకు మ‌రో షాక్. సీనియ‌ర్ క‌మెడియ‌న్ కొండ‌వ‌ల‌స ల‌క్ష్మ‌ణ‌రావు క‌న్నుమూసారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఈయ‌న‌.. నిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఆగ‌స్ట్ 10, 1946.. శ్రీ‌కాకుళంలో ఆయ‌న జ‌న్మించారు. వంశీ తెర‌కెక్కించిన ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు కొండ‌వ‌ల‌స‌. అంత‌కుముందు ఆయ‌న విశాఖ పోర్ట్ ట్ర‌స్టులో ప‌నిచేసారు. కొండ‌వ‌ల‌స‌కు నాట‌క అనుభ‌వం కూడా ఉంది.

56 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న న‌టుడిగా మారారు. ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారులో ఐతే ఓకే అనే ఒక్క డైలాగ్ తో ఆయ‌న సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. వెన‌క్కి తిరిగి చూసుకోకుండా 100 సినిమాల‌కు పైగా న‌టించారు. అగ్ర న‌టులంద‌రితోనూ న‌టించిన అనుభవం కొండ‌వ‌ల‌స సొంతం. ముఖ్యంగా పెళ్ళాంతో ప‌నేంటి సినిమాలో తెలంగాణ శ‌కుంత‌ల‌, కొండ‌వ‌ల‌స మ‌ధ్య వ‌చ్చే కామెడీ సీన్స్ చాలా అద్భుతంగా పండాయి. ఒట్టేసి చెబుతున్నా, స‌త్యం, ఎవ‌డి గోల వాడిదే, శ్రీ‌కృష్ణ 2006 లాంటి సినిమాల్లో కొండ‌వ‌లస నవ్వులు పూయించారు.

ఈ మ‌ధ్య కాలంలో కొండ‌వ‌ల‌స సినిమాలు బాగా త‌గ్గిపోయాయి. కొత్త క‌మెడియ‌న్లు రావ‌డం.. వ‌య‌సు పెరిగిపోవ‌డంతో ఆయ‌న ఇంటికే ప‌రిమితం అయ్యారు. చివ‌ర‌గా ఆయ‌న శ్రీ‌కాంత్ దేవ‌రాయ సినిమాలో న‌టించారు. ఇంకా కొన్ని సినిమాలు విడుద‌ల కావాల్సి ఉన్నాయి. 69 ఏళ్ల వ‌యసులో కొండ‌వ‌ల‌స మ‌ర‌ణం.. తెలుగు సినిమాకు తీరనిశోకాన్ని మిగిల్చింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆశిద్ధాం..!