ప్రేమ కథలను కామ కథలుగా తీస్తున్నారు: దాసరి!

సుధీర్ బాబు, నందిత హీరోహీరోయిన్లుగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకత్వంలో శ్రీమతి, శ్రీ లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ది బెస్ట్ రొమాంటిక్ ఫిలిం అవార్డు కైవసం చేసుకుంది. 32 దేశాల ప్రతినిధులు, 62 చిత్రాల నిర్మాతలు, ముఖ్యంగా రొమాంటిక్ విభాగంలో అంతర్జాతీయంగా 32 చిత్రాలతో పోటీపడి జె.ఐ.ఎఫ్.ఎఫ్ అంతర్జాతీయ అవార్డు సాధించడం తెలుగు సినీ రంగానికే హైలైట్. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ఇలాంటి ఓ మంచి టేస్ట్ ఫుల్ ఉన్న సినిమా తీయాలానే ఆలోచన వచ్చిన లగడపాటి శ్రీధర్ ను అభినందిస్తున్నాను. సినిమా మీద ప్యాషన్ ఉన్న నిర్మాత. తనకు ఎంత ప్యాషన్ ఉందో.. తన శ్రీమతికి కూడా సినిమా అంటే అంత ఇష్టం. శ్రీధర్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీలత ఉంటే మొదట తన భార్యే సినిమాను కాల్చేస్తుంది. శ్రీధర్ ఎప్పుడు నన్ను కలిసినా సినిమాల గురించి, అందులో ఉండే పాజిటివ్ ఎలిమెంట్స్ గురించే మాట్లాడుతుంటాడు. ఇలాంటి నిర్మాత తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో భాగంగా ఉంటే బావుంటుంది. ఒకప్పుడు ప్రేమ కథ అంటే మంచి హ్యూమర్, త్యాగం, ప్రేమ యొక్క పవిత్రత ఉండేలా సినిమా చేసేవారు. మరోచరిత్ర, మజ్ను లాంటి గొప్ప గొప్ప ప్రేమ కథల మీద సినిమాలు వచ్చాయి. పెళ్లి కానుక అనే సినిమా అయితే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. అది ప్రేమ యొక్క విలువ. ప్రస్తుతం మాత్రం తెలుగులో ప్రేమ కథలంటే కామ కథలుగా తీస్తున్నారు. ప్రేమకథల రూపమే మారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే చక్కని ప్రేమ కథకు బెస్ట్ రొమాంటిక్ ఫిలిం అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణమ్మ కలిపింది.. సినిమా చూసిన తరువాత శ్రీధర్ ను పిలిచి మంచి సినిమా చేశావు.. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పాను. డైరెక్టర్ చంద్రు మంచి టాలెంట్ ఉన్న పెర్సన్. తనకు మంచి భవిష్యత్తు ఉంది. కృష్ణ గారి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుదీర్ బాబు తన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. హిందీలో విలన్ గా కూడా చేస్తున్నాడట. నా దృష్టిలో విలన్ గా నటించినవాడే సర్వసమర్ధ నటుడు. రజినీకాంత్, మోహన్ బాబు ఇలా చాలా మంది విలన్ గా నటించి హీరోలు అయినవారే. 32 దేశాలు పాల్గొన్న ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు సినిమాకు అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. అని చెప్పారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకు అవార్డు వచ్చిందని తెలిసి దాసరి గారు ఇంటికి పిలిచి మరీ అభినందించారు. నన్ను మొదటి నుండి ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సినిమాలో సుదీర్ బాబు అధ్బుతమైన నటనను కనబరిచాడు. బాహుబలి, శ్రీమంతుడు వంటి సినిమాలకు పోటీగా నిలబడి 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రమది. హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అని చెప్పారు.

సుదీర్ బాబు మాట్లాడుతూ.. ఎన్ని హిట్ సినిమాలు వచ్చినా.. హీరో అనే వాడికి ఆడియన్స్ లో మంచి రెస్పెక్ట్ ఉండాలి. నాకు అలాంటి గౌరవం తెచ్చి పెట్టిన సినిమా ఇది. అని చెప్పారు.

చంద్రు మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ లెవెల్ లో అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాను. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో గిరిబాబు, ఎన్.శంకర్, నీలకంట తదితరులు పాల్గొన్నారు.