చంద్ర‌బాబు వ‌ర్సెస్ అచ్చెన్నాయుడు…ఎవ‌రు సుప్రీం

సీఎం చంద్ర‌బాబుకు, అచ్చెన్న‌కు మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయా? బాబు మాట‌కు సైతం అచ్చెన్న విలువ ఇవ్వ‌డం లేదా? నిబంధ‌న‌ల‌ను సాకుగా చూపుతూ చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ల‌కు అడ్డుపెడుతున్నారా? ఇంత‌కీ వీరిలో గెలుపెవ‌రిది? ఇప్పుడివే ప్ర‌శ్న‌లు ఏపీ క్యాబినేట్ స‌ర్కిల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వివ‌రాలిలా ఉన్నాయి. సీఎం స్వ‌స్థ‌ల‌మైన కుప్పంలో నిర్మాణ కార్మికుల కోసం ఓ శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటుపై వీరి మ‌ధ్య విధానప‌ర‌మైన వివాదం త‌లెత్తిన‌ట్లు తెలుస్తోంది.ఇందుకోసం భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నిధులు విడుద‌ల చేయాల‌న్న‌ది బాబు ఆదేశం.. కానీ నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌ని, సుప్రీం ఆదేశాల‌కు భిన్నంగా వెళ్ల‌లేమ‌ని కార్మిక శాఖ అధికారులు చెబుతుండడం గ‌మ‌నార్హం. మొత్తంమీద తాము కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ‌లేమ‌ని అధికారులు ఒక‌టికి ప‌దిసార్లు మంత్రి అచ్చెన్న‌కు విన్న‌విస్తున్నారు. మంత్రి కూడా యంత్రాంగం వాద‌న‌తో ఏకీభ‌విస్తున్నారు.

అచ్చెన్న అభ్యంత‌రం ఇదేనా…
హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) తరహాలో అన్ని సదుపాయాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.15 కోట్లు వ్యయం అవుతుందన్న‌ది ఓ అంచనా . కార్మిక శాఖ పరిధిలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నిదులు మంజూరు చేయాలని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు ఫైలు కార్మిక శాఖకు వెళ్లింది. కానీ కార్మిక శాఖ అధికారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిధి నుంచి కేవలం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చెబుతున్నారు.

అందువల్ల భవన నిర్మాణానికి ఈ నిధి నుంచి డబ్బు ఇవ్వలేమని కార్మిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫైలుపై నోట్‌ రాశారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ అది నిర్మాణానికి సంబంధించిన ప‌ని క‌నుక రోడ్డు భవనాల శాఖ నుంచి నిధులు సమకూర్చుకోవచ్చని సూచన కూడా చేశారని తెలుస్తోంది. చట్టంలోని నిబంధనలు అనుస‌రిస్తూ.., సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కార్మిక సంక్షేమ నిధి నుంచి నిధులు ఇవ్వడం కుదరదని మంత్రి స్పష్టం చేశారు.

ఈ వ్యవహారం అక్కడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిఐవైఆర్ కృష్ణారావు వద్దకు వెళ్లింది. సీఎస్ కూడా సీఎం ప్రతిపాదనను బలపరుస్తూ కార్మిక సంక్షేమ నిధి నుంచి రూ.15 కోట్లను విడుదల చేయవచ్చని ఫైలుపై రాశారు. తుది నిర్ణయం కోసం ఫైలును సీఎం వద్దకు పంపారు. ముఖ్యమంత్రి కూడా ప్రధాన కార్యదర్శి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని పేర్కొంటూ, కార్మిక శాఖ మంత్రి సూచనను తోసిపుచ్చారు. దీంతో నిధులు విడుదల చేస్తే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుందా అన్న అనుమానం కూడా తలెత్తడంతో ఈ ఫైలును న్యాయసలహా కోసం పంపినట్లు తెలుస్తోంది.