లవర్స్ డే మూవీ రివ్యూ

ప్రియా వారియర్, రోష‌న్‌, నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, అన్‌రాయ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం లవర్స్ డే. ముఖ్యంగా ప్రియా ప్రకాష్, రోషన్ మధ్య వచ్చిన కన్నుగీటే వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒమ‌ర్ లులు దర్శకత్వం వహించాడు. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. భారీ క్రేజ్ నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే :

రావూఫ్ రోషన్ (రోషన్) ప్రియాని (ప్రియా ప్రకాష్ వారియర్) ఫస్ట్ లుక్ లోనే ప్రేమించుకుంటారు. సీరియస్ గా ప్రేమించుకుంటున్న సమయంలో ఓ వీడియో రోషన్ లైఫ్ ను మలుపు తిప్పుతుంది. తన ఫోన్ ద్వారా కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లోకి బూతు వీడియోలు పోస్ట్ అవుతాయి. దీంతో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాడు. దీంతో ప్రియా బ్రేకప్ చెప్పి దూరమౌతుంది. గాథ సహాయంతో ఈ సస్పెన్షన్ నుంచి రోషన్ బయటపడతాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో లవర్స్ గా మారతారు. ప్రియా తిరిగి రోషన్ దగ్గరికి వస్తుంది. అదే సమయంలో రోషన్ గాథ కొందరు వ్యక్తుల చేతుల్లో పడతారు. ఇంతకూ వీరు ఎవరు. రోషన్ ప్రేమ ఎవరికి దక్కింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
రోషన్ ప్రియా ప్రేమను డైరెక్టర్ హృద్యంగా చూపించాడు. వీరి ప్రేమ సరదాగా సాగుతుంది. మధ్యలో గాథతో వచ్చి సన్నివేశాలు బాగుంటాయి. ఫ్రెండ్స్ సర్కిల్ తో సరదాగా ఎంజాయ్ చేసే సీన్స్ ఫన్నీగా ఉంటాయి. అలాగే స్టూడెంట్స్, లెక్చరర్స్ మధ్య వచ్చే సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. స్టూడెంట్స్ చేసే చిలిపి పనులు కామెడీ గా ఉంటాయి. ఓ దశలో రోషన్, ప్రియా, గాథ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. రోషన్ ఎవరిని ఇష్టపడతాడు అనే క్యూరియాసిటీని దర్శకుడు పెంచాడు.

రోషన్, ప్రియా మధ్య వచ్చే కన్నుగీటే సీన్ చాలా బాగా కంపోజ్ చేసారు. థియేటర్లో విజిల్స్ పడతాయి.
ప్రియా ప్రకాష్ అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె బాగా ప్లస్ పాయింట్. మరో వైపు గాథ పాత్ర పోషించిన నూరిన్ కూడా డిఫరెంట్ లుక్స్ ఎక్స్ ప్రెషన్స్ తో మంచి మార్కులు కొట్టేసింది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్స్ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. హీరోకు గాథకు మధ్య వచ్చే సీన్లతో పాటు వెరీ ఎమోషనల్ సాగే క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటించింది.

ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులతో పాటు, కాలేజీలో పనే చేసే స్టాఫ్, వాళ్ళలో మెయిన్ గా ఫ్యూన్ మరియు డ్రిల్ మాస్టర్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ద్రౌపది నాటకం లాంటి కొన్ని సీన్స్ లో బాగానే నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
దర్శకుడు ఒమర్ కొత్తవారితో యూత్‌ ఫుల్ కంటెంట్‌ తో, యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో స్నేహం విలువ చెప్పే కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన ఆకట్టుకుంటారు.

స్నేహం, ప్రేమ విలువను వాటి మధ్య తేడాను చెప్పే ప్రయత్నంలో దర్శకుడు అనుకున్న కథను తెర మీదకు ఆసక్తికరంగా మలచగలిగాడు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సరదాగా సాగే సీన్లతో నవ్వు తెప్పిస్తూ… రొమాంటిక్ కామెడీతో నడిపితే, సెకెండ్ హాఫ్ లో ఓ ఫ్లోలో సాగే సీన్స్ తో కథను మొదలు పెట్టి.. ఎలివేట్ అయ్యే కథలోని మెయిన్ ఎమోషన్ తో సినిమాని ఎమోషనల్ గా నడిపారు. అయితే ఎమోషనల్ సాగే క్లైమాక్స్ తో మెప్పించే ప్రయత్నం చేసి సర్ ప్రైజ్ చేశాడు. భావోద్వేగమైన సన్నివేశాలతో క్లైమాక్స్ పార్ట్ నడిచింది. హీరో ఫ్రెండ్, బయోలజీ మేడమ్ ట్రాక్ బాగుంది.

దర్శకుడు తన విజన్ కి తగ్గట్లు సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. పైగా ఆయన రాసుకున్న కథా కథనాలు ఊహించని విధంగా ఉంటాయి. ఇక సినిమాలో శీను సిద్ధార్థ్‌ కెమెరా పనితనం బాగుంది. షాన్ రెహ‌మాన్‌ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. అలాగే ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్ అచ్చు విజ‌య‌న్‌, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

ఫైనల్ గా….
ఒమర్ లులు దర్శకత్వంలో సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ రోషన్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం యూత్ నే కాకుండా అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటుంది. అయితే ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు. కాలేజ్ డేస్ ని గుర్తు చేసే విధంగా ఫన్నీగా సాగే సన్నివేశాలు బాగున్నాయి. సో గో అండ్ ఎంజయ్.

PB Rating : 3.25/5