అసాధారణ గాత్ర మాధుర్యంతో సంగీతానికే కొత్త సొగసులు అద్దిన స్వర మాంత్రికుడు మహ్మద్ రఫీ

భారతీయ సినిమా ప్రపంచాన్ని మధురగానంతో తడిసిముద్దైపోయేలా చేసిన గాయకుడు మహ్మద్ రఫీ. బాలీవుడ్ ప్రపంచానికి దొరికిన ఒక అరుదైన ఆణిముత్యం  రఫీ. తన అసామాన్యమైన ప్రతిభతో భారతీయ సంగీతాన్ని, కీర్తిని విశ్వవిఖ్యాతం చేశారు. పాటల్లోనే నవరసాలు ఒలికించిన వన్ అండ్ ఓన్లీ లెజండ్ మహ్మద్ రఫీ.విలక్షణ గాత్రం ఉర్రూతలూగించిన రఫీ 17 భారతీయ భాషల్లో పాటలు పాడి మెప్పించారు. బాలీవుడ్ ను 35ఏళ్లపాటు ఏకచత్రాదిపత్యంగా ఏలిన మహ్మద్ రఫీ తన కెరీర్ లో 26వేలకుపైగా పాటలు పాడి ఆడియెన్స్ మంత్రముగ్దులను చేశారు. ఈ మెలోడీ కింగ్ తెలుగు ఆడియెన్స్ కూడా తన మధుర గీతాల్లో ఓలలాండించాడు.
టిపికల్ వాయిస్ తో, స్టార్ సింగర్ గా హిందీలో ఓ వెలుగు వెలుతుగుతున్నప్పుడే తెలుగు ప్రేక్షకులను కూడా తన పాటల పూతోటలో విహరింపజేశారు మహ్మద్ రఫీ. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆరాధన, అక్బర్ సలీం అనార్కలీ, తల్లాపెళ్లామా, భలేతమ్ముడు సినిమాల్లో మధురమైన పాటలతో మైమరిపించారు మహ్మద్ రఫీ. మహ్మద్ రఫీ స్వరానికి, ఆయన  బిహేవియర్ కు ఎక్కడా పోలిక కనిపించదు. మనిషి చూస్తే చాలా హూందాగా కనిపించే వారు. కానీ ఆయన పాటలతో మాత్రం హుషారెత్తించే వాడు. అసలు కొన్ని పాటలు వింటే ఈపాట పాడింది మహ్మద్ రఫీయేనా అనే అనుమానం కలుగుతుంది.

 

భారతీయ సినీ సంగీతాన్ని నాలుగు దశాబ్దాలపాటు తన గాత్రమాధుర్యంతో సుసపన్నం చేశాడు మహ్మద్ రఫీ. ఈ మధుర గాయకుడు డిసెంబర్ 24, 1924లో జన్మించారు. రఫీ స్వస్థలం పంజాబ్ లోని కోట్ల సుల్తాన్ సింగ్ గ్రామం. మహ్మద్ రఫీ తన కుటుంబంలోని ఆరుగురి సంతానంలో ఐదువాడు. రఫీ చిన్నతనంలోనే కుటుంబమంతా పంజాబ్ నుంచి లాహోర్ వెళ్లిపోయింది. రఫీకి సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన అతని రెండో అన్న హమీద్  హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఉస్తాద్ వాహిద్ ఖాన్ దగ్గర మహ్మద్ రఫీ సంగీతం నేర్చుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ అలీ పరిచయం తర్వాత 1947లో జుగ్ను సినిమాలో పాడిన డ్యూయట్ తో మహ్మద్ రఫీకి బాలీవుడ్ లో తొలి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా అన్ని భాషల్లోనూ రఫీ పాటలు వినిపించాయి.

 

సంగీత దర్శకుడు నౌషాద్ పరిచయం తర్వాత ఇక మహ్మద్ రఫీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1947 నుంచి 1980 వరకు అంటే సుమారు 35 ఏళ్లపాటు సినిమా ఇండస్ట్రీని తన పాటల తో మైమరచిపోయేలా చేశాడు ఈమెలోడీ కింగ్. ఒకసారి జాతీయ అవార్డుతోపాటు 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు  మహ్మద్ రఫీ. మధురమైన పాటలతో సినీసంగీతానికి రఫీ చేస్తున్న సేవను గుర్తించి భారత ప్రభుత్వం 1967లో  పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

కెరీర్ ముగిసి పోతుందనుకున్న మహామహులైన హీరోలకు కొత్త ఊపిరిపోశాడు మహ్మద్ రఫీ. కేవలం తన విలక్షణమైన పాటలతో సినిమాను సిల్వర్ జూబ్లీ వైపు పరుగులు పెట్టించిన కింగ్ ఆఫ్ ఆల్ సింగర్స్ మహ్మద్ రఫీ. మహ్మద్ రఫీ 1944 నుంచి 1980 వరకు మూడు తరాల హీరోలకు పాటలుపాడి మెప్పించాడు. ఏవయసు హీరో తగ్గట్టుగా తన వాయిస్ను మార్చుకొని పాటలు పాడటమే కాదు తనపాటలతోనే సినిమాలను సూపర్ డూపర్ హిట్స్ చేశాడు మహ్మద్ రఫీ. హీరోల బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా తన వాయిస్ ను మార్చేవారు రఫీ. ఈవిషయంలో షమ్మీకపూర్ కు అదిరిపోయేపాటలు పాడి వీళ్లిద్దరిది పర్ఫెక్ట్ జోడీ అనిపించాడు.

 

కిషోర్ కుమార్ ఎంట్రీతో బాలీవుడ్లో రఫీ క్రేజ్ కొంత వరకు తగ్గింది. ఈసమయంలోనే కొంత కాలం గడ్డుపరిస్థితి ఎదురైంది. కానీ 1977లో హమ్ కిసీసే కమ్ నహీ సినిమాలో పాటతో మళ్లీ తన సత్తా చూపించారు. ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు.ఆ తర్వాత కిషోర్ కుమార్ సినిమాలకు కూడా తాను పాటలు పాడి ఔరా అనిపించుకున్నారు. సుదీర్ఘ పాటల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు మహ్మద్ రఫీ. దేశభక్తి గీతాలు, రొమాంటిక్ పాటలు, సెంటిమెంట్ సాంగ్స్, గజల్స్, ఫాస్ట్ బీట్స్ ఇలా మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి ఎమోషన్ కోరుకున్నా క్షణాల్లో అలా మారిపోయి అదిరిపోయే రేంజ్లో పాటలు పాడి మెప్పించారు మహ్మద్ రఫీ అందుకే మూడు తరాల మ్యూజిక్ డైరెక్టర్లకు మోస్ట్ ఫేవరేట్ గాయకుడు అయ్యాడు రఫీ.

తరాలు మారిన తరగని క్రేజ్ తో బాలీవుడ్ తో  ఏలిన ఈ స్వర సామ్రాట్ 1980లో 55ఏళ్ల వయసులో జూలై 31న గుండెపోటుతో చనిపోయారు. చనిపోవడాని మూడు గంటల ముందు కూడా ఆస్పాస్ అనే సినిమా పాటను రికార్డింగ్ చేసి వచ్చారు మహ్మద్ రఫీ. అలా చిన్నప్పుడు పాటలు వింటూనే పెరిగి ఆతర్వాత అవే పాటలతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్రను వేశాడు అమర గాయకుడు మహ్మద్ రఫీ.