త‌మిళ ఆచి మ‌నోర‌మ అస్త‌మ‌యం..

త‌మిళ ప్రేక్ష‌కులు ఆచి అని ముద్దుగా పిలుచుకునే మ‌నోర‌మ‌ ఇక‌లేరు. ఆచి అంటే అమ్మ అని అర్థం.. అలాంటి గొప్ప ప‌దాన్ని మ‌నోర‌మ‌కు బిరుదుగా ఇచ్చారు అర‌వ ప్రేక్ష‌కులు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో 1200 చిత్రాల‌కు పైగా న‌టించారు మ‌నోర‌మ‌. నాటి ఎమ్జీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి, ర‌జినీకాంత్, క‌మ‌ల్ త‌రం వ‌ర‌కు అంద‌రితోనూ న‌టించారు మ‌నోర‌మ‌. ఈ మ‌ధ్య కాలంలో ఆమె న‌టించిన తెలుగు సినిమా అరుంధ‌తి. ఇందులో ఆమె న‌ట‌న‌కు జేజేలు ప‌లికారు ప్రేక్ష‌కులు. గుండెపోటుతో ఈమె నిన్న‌రాత్రి చెన్నైలో క‌న్నుమూసారు.

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఉన్న మ‌నోర‌మ‌ చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న‌పుడు స‌డ‌న్ గా హార్ట్ ఎటాక్ రావ‌డంతో హాస్పిట‌ల్ కు తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. మ‌నోర‌మ మృతిపై త‌మిళ‌ ప‌రిశ్ర‌మ‌తో పాటు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ కూడా దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఓ సీనియ‌ర్ లెజెండ‌రీ న‌టిని మ‌నం కోల్పోయాం అంటూ మ‌నోర‌మ‌కు నివాళులు అర్పిస్తున్నారు సినీ ప్ర‌ముఖులు.
ఐదుగురు ముఖ్య‌మంత్రుల‌తో క‌లిసి న‌టించిన ఏకైక న‌టిగా మ‌నోర‌మ చ‌రిత్ర సృష్టించారు. తెలుగులో ఎన్టీ రామారావు, త‌మిళ‌నాట ఎమ్జీఆర్, జ‌య‌ల‌లిత‌, అన్నాదొరైల‌తో క‌లిసి ఆమె న‌టించారు. అంతేకాదు.. క‌రుణానిధి క‌థ అందించిన సినిమాల్లోనూ మ‌నోర‌మ న‌టించారు. 1958లో వ‌చ్చిన త‌మిళ సినిమా మాలాయిట్ట మాంగై సినిమాతో ఆమె వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌ర్వాత ఎన్నో త‌మిళ సినిమాల్లో న‌టించారు. 1968లో వ‌చ్చిన తిల్లాన మ‌హ‌నంబాల్ అనే సినిమా ఆమె కెరీర్ ను మ‌లుపు తిప్పింది. 70 వ ద‌శ‌కంలో క‌మెడియ‌న్ న‌గేశ్ తో క‌లిసి మ‌నోర‌మ న‌టించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. వీళ్ల జోడీ త‌మిళ‌నాట ఎవ‌ర్ గ్రీన్ హిట్.
మ‌నోర‌మ కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు.. మంచి గాయ‌కురాలు కూడా. ఎన్నో త‌మిళ సినిమాల్లో ఈమె పాట‌లు పాడారు. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ సినీ పరిశ్ర‌మ‌ల నుంచి ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు మ‌నోర‌మ‌. ఇక 1989లో వ‌చ్చిన పుదీయ ప‌త్తై అనే త‌మిళ సినిమాకు ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్నారు మ‌నోర‌మ‌. 2002లో కేంద్ర‌ప్ర‌భుత్వం ఈమెను ప‌ద్మ‌శ్రీ బిరుదుతో స‌త్క‌రించింది. మ‌నోర‌మ భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయి ఉంచొచ్చు గానీ ఆమె న‌టించిన వేల పాత్ర‌లు ఎప్ప‌టికీ మ‌న ముందే ఉంటాయి. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరూల‌ని కోరుకుందాం..!