ఒక్క సినిమా.. ఎన్నో స‌మాధానాలు..

మారుతి.. ఈ పేరు విన‌గానే అంద‌రికీ ముందు గుర్తొచ్చేది అడల్ట్ సినిమాలు, కుళ్లు జోకులు. గ‌తం చూసుకుంటే ఇదే క‌నిపిస్తుంది మరి. ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి.. గుర్తింపు తెచ్చుకోడానికి ఈరోజుల్లో, బ‌స్టాప్ లాంటి లో క్వాలిటీ సినిమాలు తీసాడు మారుతి. కానీ వాటిని కూడా క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ చేసిన ఘ‌న‌త ఈ ద‌ర్శ‌కుడిదే. అయితే డ‌బ్బులొచ్చినా.. స్టార్స్ ఎవ‌రూ మారుతిని న‌మ్మ‌లేదు.. విమ‌ర్శ‌కులు తిట్ల‌దండ‌కం ఆప‌లేదు. వాళ్ల నోళ్ల‌కు తాళం వేసేలా ప్రేమ‌క‌థాచిత్రంతో ఫ‌స్ట్ టైమ్ మారిన మారుతిని చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అయినా అల‌వాటైన చేయి కావ‌డంతో.. అందులోనూ కాసిన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగులు ప‌డేసాడు మారుతి. త‌ర్వాత కొత్త‌జంట‌తో క్లీన్ సినిమా తీసాడు కానీ అది కాస్తా బాక్సాఫీస్ దగ్గ‌ర అనుకున్న విజయం సాధించలేదు. దాంతో మారుతికి బూతు సినిమాలు తప్ప‌.. క్లీన్ సినిమాలు తీయ‌డం రాదంటూ మ‌రోసారి విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు.. వెంక‌టేశ్, సునీల్ లాంటి హీరోలు మారుతి క‌థకు ఓకే చెప్పి త‌ప్పుకున్నారు. ఆ క‌సితోనే నానితో ఇప్పుడు భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమా చేసాడు. నాని కూడా మొద‌ట్లో మారుతితో సినిమా అంటే భ‌య‌ప‌డ్డాన‌ని చెప్పాడు. కానీ అంద‌రి విమ‌ర్శ‌ల‌కు జ‌వాబు చెప్తూ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ను భ‌లేభ‌లే మ‌గాడివోయ్ రూపంలో ప్రేక్ష‌కుల‌కు ఇచ్చాడు మారుతి. ఈ సినిమా చూసిన వాళ్లంతా.. నిజంగా ఇది తీసింది మారుతినేనా అనే అనుమానంలో ఉన్నారు. అంత‌గా త‌న‌పై ఉన్న మార్క్ తొల‌గించేసుకున్నాడు మారుతి. మ‌రి భ‌లేభ‌లే మ‌గాడివోయ్ చూసిన త‌ర్వాతైనా మారుతి వైపు స్టార్ హీరోలు క‌న్నేస్తారో లేదో చూడాలి.